కడపకు విమానాలు ఆగిపోతాయా? ఏమిటీ సమస్య?
చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా గతంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని ప్రవేశ పెట్టారు
కడపకు విమాన సర్వీసులు మొదలై చాలాకాలమే అయ్యింది. అయితే.. ఈ సెప్టెంబరు 15 తర్వాత ఫ్లైట్ సర్వీసులు ఆగిపోనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత? అన్నది చూస్తే.. అసలు విషయం ఏమిటో అర్థమవుతుంది. చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా గతంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా విమాన సర్వీసులు నడపటం ద్వారా విమానయాన సంస్థలకు నష్టం వస్తే.. ఆదుకునేందుకు వీలుగా ఫండ్ ఏర్పాటు చేశారు. అయితే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ పథకాన్ని ఆపేసింది. దీంతో.. నష్ట భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేలా చూసుకోవటం.. లేదంటే విమాన సర్వీసులు ఆగిపోవటం జరుగుతోంది.
కడప విషయానికి వస్తే.. గతంలో ఇక్కడకు ట్రూజెట్ సంస్థ విమానాలు నడిపేది. ఆ తర్వాత సర్వీసులు ఆపేసింది. దీంతో ఆర్నెల్లకు పైనే విమాన రాకపోకలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు.. ఇండిగోకుమధ్య ఒప్పందం కుదిరింది. గ్యాప్ ఫండింగ్ కింద రాష్ట్ర సర్కారు ఇండిగోకు ఏటా రూ.20కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
విమానాలు ఆగిపోయిన నేపథ్యంలో ఏపీ విపక్ష నేత జగన్ సర్కారుకు లేఖ రాశారు. తమ ప్రభుత్వంలో ఉడాన్ పథకం కింద టైర్2, టైర్ 3 నగరాల మధ్య విమాన సర్వీసులు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కడప నుంచి హైదరాబాద్, విజయవాడ,చెన్నై, బెంగళూరుకు సర్వీసులు నిర్వహించిన అంశాన్ని పేర్కొన్నారు. అనంతరం జగన్ సర్కారు ఇండిగో సంస్థతో చర్చలు జరిపింది. దీంతో 2022 మార్చి 27 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం పట్టణాలకు విమానాలు నడిచాయి.
కానీ.. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా చేసుకున్న చెల్లింపులు రాకపోవటంతో ఇండిగో సంస్థ ఇబ్బందులకు గురవుతోంది. దీంతో.. తాజాగా సెప్టెంబరు 1 తర్వాత నుంచి కడప నుంచి విమానసర్వీసులు ఆపేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాన్ని నిలిపేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ ను ఇండిగో ప్రతినిధులు కలిసి.. ముందస్తు సమాచారాన్ని ఇచ్చారు.
అయితే.. చెల్లింపులకు మరికొంత సమయం అడగటంతో సెప్టెంబరు 25 వరకుఆన్ లైన్ లో టికెట్లు అమ్మేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ లోపు చెల్లింపులు జరగకుంటే మాత్రం.. సర్వీసులు నిలిచిపోతాయని చెబుతున్నారు. అయితే.. ఇండిగోకు చెల్లించాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉండటంతో.. ప్రభుత్వానికి అదేమంత కష్టం కాదంటున్నారు. అయితే.. ఇలాంటి చిన్న విషయాలు చివర వరకు వచ్చేదాకా ఆగేకంటే.. ముందే పూర్తి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.