మాజీ మంత్రి కాకాణికి కేసు షాక్.. ఎందుకంటే?

తాము చేసిన పనిని తమ రాజకీయ ప్రత్యర్థులు అదే తీరుతో ఉంటారన్న సోయి వారిలో ఎందుకు మిస్ అవుతుంది?

Update: 2025-01-07 13:30 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా నడిచిపోతుంది. అలా అని.. అధికారం చేతిలో లేనప్పుడు.. ఎంత తోపు అయినా నోరు జారితే తిప్పలే ఎదురవుతాయన్న విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు గుర్తించటం లేదు? ఐదేళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు.. ఆయా పార్టీల నేతలు కాస్త తేడాగా మాట్లాడినా.. కొన్నిసార్లు మాట్లాడకున్నప్పటికి కేసులతో బుక్ చేసిన వైనాన్ని వారెందుకు మర్చిపోతున్నారు. తాము చేసిన పనిని తమ రాజకీయ ప్రత్యర్థులు అదే తీరుతో ఉంటారన్న సోయి వారిలో ఎందుకు మిస్ అవుతుంది?

అలాంటి విషయాల్ని మర్చిపోయిన వారందరికి కేసులతో షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో చేరారు ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆయనపై నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్ సటేషన్ లో కేసు నమోదైన విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. డిసెంబరు 27న కేసు నమోదైతే.. ఆ విషయం జనవరి ఆరున కానీ బయటకు రాలేదు. దీంతో కాకాణి వర్గీయులు షాక్ కు గురవుతున్నారు. వెంకటాచలం మండలానికి చెందిన ఒకరు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ కేసు నమోదు చేసేంత పని కాకాణి ఏం చేశారన్నప్పుడు.. చాలానే విషయాలు చెప్పుకొచ్చారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు.. కాకాణికి ముఖ్య అనుచరుడిగా ఉన్న వెంకట శేషయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ తనను శేషయ్య వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయటంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలుజారీ చేశారు.

తన ప్రధాన అనుచరుడి రిమాండ్ నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి రగిలిపోయారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటాచలం సీఐ సుబ్బారావు ఖాకీ దుస్తులు ఊడదీసి.. శాశ్వితంగా పచ్చచొక్కా వేసుకొని చంద్రబాబు.. లోకేశ్.. టీడీపీ లీడర్ల చుట్టూ తిరగాల్సిందేనని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని ఆయన సీఐను శాశ్వితంగా విధుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీఐతో పాటు వెంకటాచలం ఆర్ఐ రవిపైనా ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో.. పోలీసులను, అధికారులను మాజీ మంత్రి బెదిరింపులకు దిగినట్లుగా పేర్కొంటూ ఆయనపై ఒకరు ఫిర్యాదు చేయగా.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్లనుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News