సీనియర్ ని అని గుర్తు చేస్తున్నా కళాకు నో చాన్స్ ?
ఉత్తరాంధ్రాలో అత్యంత సీనియర్ నేతగా కిమిడి కళా వెంకట్రావుకు గుర్తింపు ఉంది.
ఉత్తరాంధ్రాలో అత్యంత సీనియర్ నేతగా కిమిడి కళా వెంకట్రావుకు గుర్తింపు ఉంది. ఆయన అతి పిన్న వయసులో దివంగత నేత ఎన్టీఆర్ పిలుపుని అందుకుని రాజకీయాలు మొదలెట్టారు. 1983లోనే శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు నుంచి అసెంబ్లీకి మొదటి సారి గెలిచి వచ్చారు. ఇక నాటి నుంచి టీడీపీలో ఆయన హవా మొదలైంది.
ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి తొలిసారి హోం మంత్రి అయిన రికార్డు కూడా ఆయనదే. అన్న గారు ఆయనను ఎంతో గౌరవించేవారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు ఎర్రన్నాయుడు గౌతు శివాజీ వంటి వారు చంద్రబాబు వర్గంలో ఉంటే కళా వెంకట్రావు వంటి వారు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గంలో ఉండేవారు.
ఇక కళా వెంకటరావు రాజ్యసభకు కూడా వెళ్ళారు. అయన మంత్రిగా అనేక కీలక శాఖలు చూశారు. 2009 టైం లో సామాజిక వర్గం ఒత్తిడితో ప్రజారాజ్యం వైపు వెళ్ళినా తిరిగి వచ్చేశారు. ఆయన చంద్రబాబుకు లోకేష్ కి కూడా సన్నిహితుడుగా నిలిచారు. ఈ కారణం వల్లనే ఆయనకు విభజన ఏపీలో తొలి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది.
అంతే కాదు ఆయనకు 2014 నుంచి 2019లోని బాబు మంత్రివర్గంలో మంత్రిగానూ చోటు దక్కింది. ఇక 2019లో ఓడిన కళా 2024లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాలని చూసినా చివరి నిముషంలో జరిగిన మార్పులలో భాగంగా ఆయనను చీపురుపల్లికి షిఫ్ట్ చేశారు. వైసీపీ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను ఓడించే సత్తా కళాకు ఉందని చెప్పి పంపించారు. కళా కూడా భారీ మెజారిటీతో గెలిచి వచ్చారు.
తనకు కచ్చితంగా మంత్రివర్గంలో ప్లేస్ ఉంటుందని ఆయన లెక్క వేసుకున్నారు. అయితే విజయనగరం జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యే అయిన కొండపల్లి శ్రీనివాస్ కి చాన్స్ ఇచ్చి కళాను పక్కన పెట్టారు. స్పీకర్ పదవికి ఆయన పేరు కచ్చితంగా పరిశీలిస్తారు అని అనుకున్నా అది కూడా లేదని అర్థమైంది. ఆ తరువాత టీటీడీ చైర్మన్ పదవి కళాకే ఇస్తారని ప్రచారం సాగింది. అది కూడా కాదని తేలిపోయింది. కీలక నామినేటెడ్ పదవులలో ఆయన పేరు ఎక్కడా లేదు.
దాంతో కళా వర్గం పూర్తిగా నిరాశలో ఉంది. పెద్దాయన పట్ల పార్టీలో వివక్ష సాగుతోందని వారు లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో సరిసమానంగా ఉంటూ తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా 1983 బ్యాచ్ గా ఉన్నా కళాకు మాత్రం హ్యాండ్ ఇస్తున్నారు అని అంటున్నారు.
ఇక స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికైన సందర్భంగా నిండు సభలో కళా ఆయనను అభినందిస్తూ మాట్లాడిన మాటలు చూస్తే తన సీనియారిటీ ఆయన చెప్పకనే చెప్పినట్లు అయింది. మీరూ నేనే 1983 టీడీపీ బ్యాచ్ గా సభలో ఉన్నామని కళా చెప్పడం వెనక తాను సీనియర్ ని సుమా అని తెలియచేయడం ఉందని అంటున్నారు.
ఇక కళాకు ఏ పదవి ఇస్తారు అన్నది కూడా ఇపుడు తెలియడం లేదు అని అంటున్నారు. సీనియర్లను జస్ట్ ఎమ్మెల్యేలుగా ఉంచి అయిదేళ్ళ తరువాత కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. తనకు మంత్రిగా 2014 నుంచి 2019 టెర్మ్ లో జస్ట్ లాస్ట్ రెండేళ్ళు మాత్రమే చాన్స్ దొరికిందని ఈసారి ఆ లోటు తీర్చుకుంటూ అయిదేళ్ళ మంత్రిగా ఉందమని అనుకున్న కళాకు ఇపుడు రాజకీయ కళ ఎక్కడా కనిపించడంలేదు అని అంటున్నారు.
మరి ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగానే ఆయన తీరు ఉంది అని అంటున్నారు. చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్న కళాకు పిలిచి ఏదైనా పదవి ఇస్తారేమో అన్న ఆశ మాత్రమే ఇపుడు మిణుకు మిణుకు మంటోందిట.