కాళేశ్వరంపై కమిషన్ ఏం తేల్చనుంది.. ఈసారి విచారణకు హాజరయ్యేది ఎవరు..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టా్త్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.

Update: 2024-09-19 07:02 GMT

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టా్త్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. లక్ష ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. సరే.. ప్రాజెక్టు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రాజెక్టు పరిధిలోని మూడు బ్యారేజీల నిర్మాణంలో వచ్చిన లోపాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు వెంటాడుతున్నాయి.

పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఇదే క్రమంలో ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూడు బ్యారేజీలు కుంగాయి. దాంతో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను తెలుసుకునేందుకు ఈ కమిషన్ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్ల నుంచి వాంగ్మూలాలను ఈ కమిషన్ రికార్డు చేస్తోంది. అలాగే.. బ్యారేజీలను స్వయంగా సందర్శించారు కూడా. అక్కడి సాంకేతిక సమస్యలను చూశారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్లు మునిగిపోవడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి లీకేజీలు ఏర్పడడాన్ని స్వయంగా పరిశీలించింది.

జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు తరలించాల్సి వచ్చిందో ఆయన సవివరంగా వివరించారు. అక్కడ 75శాతం సరిగా నీటి లభ్యత లేదనే నెపంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో కొత్త ప్రదేశానికి తరలించిందని చెప్పారు.

దాంతో అప్పటి నుంచి ప్రాజెక్టులో భాగస్వాములైన ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, అధికారులను కమిషన్ విచారిస్తూ వస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పినాకి ఘోష్‌తో నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులను విచారించగా.. వారి వాంగ్మూలాలను సేకరించింది. అయితే.. మరోమారు విచారణ నిమిత్తం కమిషన్ హైదరాబాద్ చేరుకుంది. దీనిపై ఈ రోజు నుంచి తదుపరి విచారణ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు ఇంజినీర్లు, అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై కమిషన్ విచారించనుంది. ఇందులో భాగంగా ఓపెన్ కోర్టుకు ఎవరిని పిలవాలనే దానిపై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. గతంలో ఓపెన్ కోర్టులో ఇంజినీర్లు, అధికారులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. కానీ.. ఇక నుంచి ఆ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించాలని నిర్ణయించారు. ఈసారి అధికారులు, ఇంజినీర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో కమిషన్ ఎవరెవరిని మరోసారి విచారణకు పిలుస్తుందా..? లేదంటే గత విచారణతోనే ఆపేసి క్రాస్ ఎగ్జామిన్ చేస్తుందా..? అనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. మరోవైపు.. ఈ ప్రాజెక్టులో అవకతవకలపై ఇంకా పొలిటికల్‌గా ఎలాంటి విచారణ ప్రారంభం కాలేదు. ఒకవేళ కమిషన్ ఆ దిశగానూ దృష్టి సారిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి కమిషన్ ఎంక్వయిరీ ఎవరి నుంచి ప్రారంభమై.. ఎవరితో ఎండ్ అవుతుందా అని చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News