రేవంత్ టు చంద్రబాబు... "నా గొడవ"నే ఎందుకు?

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే

Update: 2024-07-08 08:39 GMT

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విభజన సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు. అధికారులతోనూ, ఇరు రాష్ట్రాల మంత్రులతోనూ కమిటీలు వేయాలనే ఆలోచనా చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు.

ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఓ పెద్ద స్వీటు బాక్సుతో పాటు, శాలువా కప్పి శ్రీవారి చిత్రపటంతో కూడిన మెమెంటోలను రేవంత్ బృందానికి ఇచ్చారు. ఇదే సమయంలో... రేవంత్ కూడా చంద్రబాబుకు రెండు రకాల బహుమతులు ఇచ్చారు. అందులో ఒకటి వెండి నంది విగ్రహం కాగా.. కాళోజీ నారాయణరావు రాసిన "నా గొడవ" పుస్తకం ఒకటి. అదే ఎందుకు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు రాసిన "నా గొడవ" అనే పుస్తకాన్ని ఇచ్చారు. అయితే తెలంగాణకు చెందిన నారాయణరెడ్డి, దాశరధి రంగాచార్యులు రాసిన పుస్తకాలు కాకుండా... ప్రత్యేకంగా "నా గొడవ" పుస్తకానే ఇవ్వడం వెనుక లోతైన అంతరంగం ఉందని అంటున్నారు.

కాళోజీ తన పుస్తకంలో... "జీ" అనని "కలేజా"తో కాళోజీ అనునది "నఖరా"లు లేనట్టిది! అన్యాయాన్నెదిరిస్తే... "నాగొడవ"కు సంతృప్తి!! అని పేర్కొన్నారు. దీంతో... ఈ ఫంక్తులు ఉన్న పుస్తకాన్నే చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వడం వెనుక తన ఉద్దేశ్యం కూడా దాదాపుగా అదే అని.. తెలంగాణ ఉద్యమం నిత్యం తనకు గుర్తుంటుందని రేవంత్ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చని ఓ చర్చ తెరపైకి వచ్చింది.

కాగా... తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు గడిచినా ఇంకా విభజన సమస్యలు తేలని సంగతి తెలిసిందే. దీనిపై గతంలో చంద్రబాబు - కేసీఆర్.. వైఎస్ జగన్ - కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ - చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమయంలో త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు!

Tags:    

Similar News