బీజేపీతో జట్టు కట్టేందుకు గులాబీ బాస్ ఆరాటం

గులాబీ బాస్ కొత్త ఎత్తుకు తెర తీశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎలాంటి నిర్ణయానికైనా

Update: 2024-02-14 10:30 GMT

గులాబీ బాస్ కొత్త ఎత్తుకు తెర తీశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎలాంటి నిర్ణయానికైనా.. ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవటం.. ఆ సమయానికి తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయటం గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్తేం కాదు. జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ ఉద్యమ వేళలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని కోరుతూ అప్పట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తమ పార్టీఅగ్రనేతల్ని పండ్లు ఇచ్చి మరీ పంపి రాయబారం చేయటాన్ని మర్చిపోలేరు.

తెలంగాణ సాధన తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంచెలాయిస్తున్న వేళలో.. తాము ఎప్పుడు కూడా బీజేపీ సాయం కోరలేదని.. ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ బీరాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు అదే కమలం పార్టీతో పొత్తు కోసం కిందా మీదా పడుతున్నట్లుగా చెబుతున్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే తలనొప్పుల గురించి తెలియంది కాదు.

అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్ సభ ఎన్నికలకు మధ్య భావోద్వేగం వేరుగా ఉంటుంది. ఇదే విషయాన్ని 2018చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నాటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ఐదారు నెలలకే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవటం తెలిసిందే. సారు.. కారు.. పదహారు అంటూ భారీగా ప్రచారం చేసినా తెలంగాణ ఓటర్లు పట్టించుకోలేదు సరి కదా బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చిన సీట్లతో కేసీఆర్ అండ్ కో ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.

అధికారం చేతిలో ఉన్న అప్పట్లోనే ఫలితాలు అలా ఉంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావటం.. మేడిగడ్డ ప్రాజెక్టు నీడలా తరుము రావటం.. రేవంత్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేని నేపథ్యంలో ఏ ఎజెండాతో ఎన్నికలకు వెళతారన్నది ప్రశ్న. తాము అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల కాలంలో అధికారం చేతిలో లేని పార్టీ చెల్లని రూపాయిగా పేర్కొంటూ వారిని గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న వాదనను వినిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు అందుకు భిన్నమైన వాదనను వినిపించే నమ్మే పరిస్థితుల్లో ప్రజల్లేరన్నది గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చగా చెబుతున్నారు.

ఇప్పుడున్న మోడీ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మోడీని హ్యాట్రిక్ పీఎం చేయాలన్న నినాదంతో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ.. బీజేపీతో పొత్తు మినహా మరో దారి లేని పరిస్థితి. ఒకవేళ పొత్తు లేని పరిస్థితుల్లో మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో బీజేపీతో స్నేహ హస్తం చాచేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. వీరి ప్రయత్నాలకు బీజేపీ అధినాయకత్వం సానుకూలంగా స్పందించటం లేదంటున్నారు. ఎన్నికలకు మరింత సమయం ఉన్న నేపథ్యంలో ఏదోలా మోడీ జట్టులోకి చేరే అవకాశాల మీద గులాబీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. గులాబీ పార్టీ స్నేహ హస్తం ఏ పరిస్థితుల్లో చాచిందన్న విషయంపై కమలనాథులకు బాగానే తెలుసన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News