సుప్రీంకోర్టులోనూ పాయే.. కవితకు ఇక బెయిల్‌ రానట్టేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాజాగానూ ఊరట దక్కలేదు

Update: 2024-08-12 16:55 GMT

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాజాగానూ ఊరట దక్కలేదు. మార్చి 15న ఆమెను ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని తీహార్‌ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసినా కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కవిత బెయిల్‌ పిటిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు పలుమార్లు తోసిపుచ్చింది.

ఢిల్లీ మద్యం కేసులో తనపై నమోదైన మనీలాండరింగ్‌ కేసును సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. మార్చి 15న ఆమె అరెస్టు కాగా మార్చి 26 నుంచి ఢిల్లీలోని తీహార్‌ జైలులోనే ఉన్నారు.

కవితపై ఈడీ కేసులతో పాటు సీబీఐ కూడా అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కవిత ఈడీ కేసు, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. బెయిల్‌ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఈడీ, సీబీఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నిరాశ తప్పలేదు.

కాగా ఢిల్లీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్న సంగతి తెలిసిందే.

అయితే మద్యం వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తమ పిటిషన్‌ పై వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆగస్టు 20న విచారిస్తామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐదు నెలల నుంచి కవిత జైలులో ఉన్నారని.. ఆమె తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. 463 మంది సాక్షులను దర్యాప్తు సంస్థలు విచారించాయన్నారు. మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర ఏమీ లేదన్నారు. అందువల్ల ఆమెకు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్నవారికి బెయిల్‌ ఇచ్చారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ కోర్టు ఆయన వాదనలను తిరస్కరించింది. ఆగస్టు 20న విచారిస్తామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News