అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అనుకున్నదే జరుగుతోందిగా!

వచ్చే నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-07-24 14:30 GMT

వచ్చే నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీపడుతున్నారు. ఇక అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కొద్ది రోజుల వరకు బరిలో ఉన్నారు. చివరకు సొంత పార్టీ నేతల విమర్శల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ రంగంలోకి దిగారు. జో బైడెన్‌ తో పోలిస్తే కమలా హారిస్‌ అయితేనే ట్రంప్‌ కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలు సాగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగా కమలా హారిస్‌.. డోనాల్డ్‌ ట్రంప్‌ కు గట్టి పోటీ ఇస్తున్నారనే విషయం వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగాక ఆయన విజయావకాశాలు అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. పలు సర్వేలు ఇదే విషయాన్ని పేర్కొన్నాయి. ఇదే సమయంలో జో బైడెన్‌.. ట్రంప్‌ కంటే భారీగా వెనుకబడిపోయారని సర్వేలు తేల్చాయి. ఈ నేపథ్యంలోనే జో బైడెన్‌ పోటీ నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్‌ బరిలోకి దిగడంతో ట్రంప్‌ కు గట్టి పోటీ నెలకొంది. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వేలో ట్రంప్‌ కంటే కూడా కమలా హారిస్‌ కే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడైంది. ట్రంప్‌ కు 42 శాతం మద్దతు తెలుపుతుండగా, కమలకు 44 శాతం మంది మద్దతు తెలుపుతుండటం విశేషం. దీంతో ట్రంప్‌ కంటే కమల 2 శాతం ఆధిక్యంలో ఉన్నారు.

అమెరికా అధ్యక్ష బరి నుంచి జో బైడెన్‌ తప్పుకున్నాక వెలువడిన సర్వే ఇదే కావడం గమనార్హం. రాయిటర్స్‌/ఇప్సోస్‌ పోల్‌ ప్రకారం.. కమలా హారిస్‌ ట్రంప్‌ పై రెండు శాతం ఆధిక్యంలోకి దూసుకొచ్చారు.

కాగా అంతకు ముందు వారం జరిగిన పోల్‌ లో 59 ఏళ్ల కమలా హారిస్, 78 ఏళ్ల ట్రంప్‌ 44 శాతంతో సమానంగా నిలిచారు.

ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ల మధ్య హోరాహోరీ పోరు ఉందని అర్థమవుతోంది. ఇద్దరి మధ్య స్వల్ప మార్జిన్‌ మాత్రమే ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలతో దూసుకుపోతున్న కమలా హారిస్‌ విరాళాలు సేకరించడంలోనూ తన దూకుడు కనబరుస్తున్నారు.

జో బైడెన్‌ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నాక కమలా హారిస్‌ పట్ల సానుకూల వాతావరణం నెలకొనడంతో డెమోక్రాట్లు ఉత్సాహంతో ఉన్నారు. కమల తన పనితీరు, ప్రచారంతో ఎన్నికల్లో గెలవడం ఖాయమనే అంచనాల్లో ఉన్నారు.

రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ సర్వే ప్రకారం.. ట్రంప్‌.. కమల కంటే 1.6 శాతం అధిక మార్జిన్‌ తో ఆధిక్యంలో ఉన్నారు.

జో బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పుడు 24 శాతం మాత్రమే ఆయనకు గెలుపు అవకాశాలు ఉండగా అది ఇప్పుడు కమల హారిస్‌ బరిలోకి దిగడంతో 41 శాతానికి పెరిగిందని మరో సర్వే వెల్లడించింది. 87 శాతం అమెరికన్లు జో బైడెన్‌ బరి నుంచి తప్పుకోవడం డెమోక్రాట్లకు మేలు చేస్తుందని చెప్పారని పీబీఎస్‌ సర్వే పేర్కొంది.

పీబీఎస్‌ న్యూస్‌/ఎన్‌పిఆర్‌/మారిస్ట్‌ పోల్‌లో.. ట్రంప్‌ కు 46 శాతం విజయావకాశాలు ఉన్నాయి. కమలకు 45 శాతం చాన్సు ఉంది. మరో 9 శాతం మంది తటస్థంగా ఉన్నారు.

Tags:    

Similar News