తొలిసారి సీఎన్ఎన్ తో ముఖాముఖి.. కమలా హారిస్ ఏం చెప్పారంటే?

తాను ఎన్నికల్లో గెలిస్తే కేబినెట్ లోకి రిపబ్లికన్ పార్టీకి చెందిన వారిని కూడా తీసుకుంటానన్న ఆమె.. ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తానన్న దానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Update: 2024-08-31 05:29 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన కమలా హారిస్ తొలిసారి సీఎన్ఎన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాల్ని వెల్లడించారు. తన ప్రత్యర్థి ట్రంప్ పై కీలక విమర్శలు చేసిన ఆమె.. పలు ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాను ఎన్నికల్లో గెలిస్తే కేబినెట్ లోకి రిపబ్లికన్ పార్టీకి చెందిన వారిని కూడా తీసుకుంటానన్న ఆమె.. ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తానన్న దానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

చమురు వెలికితీత.. వలస విధానాల విషయంలో తాను మాట మార్చానన్న వాదనను ఖండించిన ఆమె.. తాను పాటించే విలువల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. తాను అధ్యక్షురాలిని అయితే చమురు వెలికితీతపై నిషేధం ఉండదన్న ఆమె.. అక్రమ వలసలపై కఠినంగా ఉంటానని పేర్కొన్నారు. ట్రంప్ ను ఓడించటం ద్వారా దేశానికి సరికొత్త దారిని నిర్దేశించాలని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ ది ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు.

ఇక.. తన జాతి మూలాల మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు హారిస్ నోచెప్పారు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఆమె.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోని మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. మిత్రదేశమైన ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ అనుసరిస్తున్న తీరునే తాను కంటిన్యూ చేస్తానన్న ఆమె.. ఇజ్రాయెల్, హమస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి రావటానికి ముందు.. బైడన్ తాను రేసు నుంచి తప్పుకుంటున్న విషయాన్ని ఒక ఆదివారం తాను భోజనం చేస్తున్న సమయంలో ఫోన్ చేసి మరీ చెప్పినట్లుగా పేర్కొన్నారు. ‘‘ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఆయన చెప్పారు. నేను కచ్ఛితమేనా? అని అడిగా’’ అంటూ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు. తనకు మద్దతు ఇచ్చే విషయంలో బైడెన్ మొదట్నించి స్పష్టతతో ఉన్నట్లు చెప్పిన ఆమె.. బైడెన్ హయాంలో ఉపాధ్యక్ష పదవిలో తాను ఉండటం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.

Tags:    

Similar News