కామినేని గట్టోరే

అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీటు ఏ పార్టీదైనా అభ్యర్ధి మాత్రం ఒక్కళ్ళే అన్నట్లుగా వాతావరణం ఉంది

Update: 2023-09-30 15:30 GMT

వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఈ నియోజకవర్గంలో వ్యవహారం అలాగే సాగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైపోయింది. కాకపోతే ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుంది ? ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ పోటీచేస్తుంది అన్న విషయమే తేలాల్సుంది. రెండు పార్టీల్లోని నేతలు తాము పలానా నియోజకవర్గంలో పోటీచేయటం ఖాయమని బహిరంగంగానే చెప్పేసుకుంటున్నారు. రెండు పార్టీల నేతలు కచ్చితంగా పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు సుమారు 30 దాకా ఉండచ్చు.

అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీటు ఏ పార్టీదైనా అభ్యర్ధి మాత్రం ఒక్కళ్ళే అన్నట్లుగా వాతావరణం ఉంది. అలాంటి వాటిల్లో కృష్ణాజిల్లాలోని కైకలూరు మొదటిది. ఇక్కడ మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ సీనియర్ టీడీపీ నేత. ఈయన అవటానికి టీడీపీ నేతే అయినా 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి గెలిచి మంత్రయ్యారు. అప్పటినుండి కామినేనే నియోజకవర్గంలో రెండుపార్టీలకు కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఇపుడు బీజేపీతో కాస్త డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తూ జనసేనకు బాగా దగ్గరయ్యారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళన్న విషయం తెలిసిందే. కృష్ణాజిల్లాలో పవన్ మొదలుపెట్టబోయే వారాహి యాత్ర రూటుమ్యాపు, ఏర్పాట్లలో కామినేని కూడా కీలకంగా ఉన్నారట. కాబట్టి జనసేనలో కూడా ఈయన కీలకమనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఈ సీటు ఏ పార్టీకి వెళ్ళినా అభ్యర్ధి మాత్రం కామినేనే అన్నది డిసైడ్ అయిపోయిందట.

అంటే పార్టీల మధ్య పొత్తులు, సీట్ల కేటాయింపులు, పోటీచేయబోయే నియోజకవర్గాల్లాంటి సమస్యలు, అయోమయం కామినేనికి లేదు. ఎందుకంటే కైకలూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ తీసుకున్నా అభ్యర్ధి మాత్రం కామినేని శ్రీనివాసే. అందుకనే ఈ నియోజకవర్గంలో పోటీచేయటానికి మూడుపార్టీల్లోను వేరే నేత కూడా ఆసక్తి చూపటంలేదు. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా కలిస్తే ఓకేనే. లేకపోతే బీజేపీ వేరే అభ్యర్ధిని వెతుక్కోకతప్పదని చెప్పాలి. సరే ప్రస్తుత పరిస్ధితుల్లో బీజేపీ తరపున ఎవరు పోటీచేసినా ఒకటేలేండి.

Tags:    

Similar News