ఏపీని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నాడు: సీఎం జగన్‌పై కన్నా ఫైర్
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు, సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు, సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏపీకి చెందిన ఆస్తులను తెలంగాణ నుంచి తీసుకురావడంలోనూ విఫలమయ్యారని దుయ్యబట్టారు. జల వివాదాలను కూడా పరిష్కరించడం లేదని.. కనీసం తెలంగాణదూకుడును కూడా అడ్డుకోలేక పోతున్నారని అన్నారు. సాగు నీరు లేక కృష్ణాడెల్టా ఎండి పోతున్నా సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సాగు ఉద్యమ నేత ఎన్జీ రంగా 123వ జయంతిని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో కన్నా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగు నీరు లేక రైతులు నానా తిప్పలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా గత 40 రోజులుగా తెలంగాణ రాష్ట్రం నీటిని మళ్లిస్తున్నా.. అదేనీరు లేక ఇక్కడి కృష్నాడెల్టా రైతాంగం గగ్గోలు పెడుతున్నా.. జగన్ స్పందించడం లేదన్నారు. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం రావాల్సిన మన ఆస్తులను వదులకున్నారని దుయ్యబట్టారు. ఈ సారి రాష్ట్రాన్ని ఏకంగా కేసీఆర్‌కు అమ్మేయాలనే ఉద్దేశంతో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక, దొంగ ఓట్ల వ్యవహారంపైనా కన్నా ఫైరయ్యారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు పెరిగిపోయాయన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రజలను మోసం చేసి గెలిచాడని కన్నా ఆరోపించారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనించారని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోదొంగ ఓట్లను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని అన్నారు. ప్రజలు తమ ఓటును కాపాడుకోవాలని.. ఉందో లేదో సరిచూసుకుని.. లేకపోతే వెంటనే అప్లయి చేసుకోవాలని ఆయన సూచించారు. తద్వారా రాష్ట్రాన్ని కాపాడాలని కన్నా పిలుపునిచ్చారు.