విడాకులిచ్చిన కూతురిని ఊరేగింపుగా తెచ్చుకున్న తండ్రి !

ఆపత్కాలంలో అండగా ఉన్నప్పుడే బంధాల విలువ పెరిగి అనుబంధాలు పెరుగుతాయి. పెళ్లి చేసి పంపడంతోనే తండ్రి బాధ్యత తీరిపోదు

Update: 2024-05-01 11:30 GMT

ఆపత్కాలంలో అండగా ఉన్నప్పుడే బంధాల విలువ పెరిగి అనుబంధాలు పెరుగుతాయి. పెళ్లి చేసి పంపడంతోనే తండ్రి బాధ్యత తీరిపోదు. ఆ బిడ్డ బతికి ఉన్నంత కాలం ఆ తండ్రికి బాధ్యతలు ఉంటాయి. జీవితాంతం సుఖంగా ఉంటుందని పెళ్లి చేసి పంపిన కూతురు తాళికట్టిన భర్త చేతిలో చిత్రహింసలు భరించలేక విడాకులు తీసుకుంది. ఈ పరిణామాలు ఆ తండ్రిని కుంగదీయలేదు. పైగా విడాకులు తీసుకున్న బిడ్డ ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితం కొనసాగించారని మేళతాళాలతో ఊరేగింపుగా ఇంటికి తెచ్చుకున్నాడు.

కాన్పూర్‌కు చెందిన ఉర్వి (36) ని 2016లో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత వరకట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ ఎనిమిదేళ్లలో వేధింపులు తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోయాయి.

ఇక లాభం లేదని ఉర్వి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. గత ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు ఇచ్చిన కోర్టు ఆమె అభ్యర్థన మేరకు విడాకులు మంజూరు చేసింది. దాంతో ఉర్వి తండ్రి ఆమెను అత్తవారి ఇంటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకెళ్లాడు.

‘మా కూతురికి పెళ్లిచేసి అత్తారింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. విడాకులతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో కుంగిపోకూడదు. నేటి నుంచి వాళ్లు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఇలా చేశాం’ అని తండ్రి అనిల్ కుమార్ తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News