కాపులలో వారి ప్రభావం ఎంత....!?
దాంతో ప్రస్తుతం కాపు పెద్దలుగా ఉన్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, అలాగే ముద్రగడ పద్మనాభం వంటి వారు అంతా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది
ఏపీలో కాపులు అతి పెద్ద సంఖ్యాబలం కలిగిన సామాజికవర్గం. వారిని సరైన దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపిస్తే రాజ్యాధికారం దక్కుతుందని భావించిన కొందరు సామాజిక పెద్దలు దశాబ్దాల వెనకటి నుంచి పాటుపడుతూ వస్తున్నారు. అలా ఎనభై దశకంలో వంగవీటి మోహన రంగా కాపుల ఆరాధ్యదైవంగా ఉన్నారు. ఆయన కనుక దారుణ హత్యకు గురి కాకపోతే కచ్చితంగా కాపులకు ముఖ్యమంత్రి కోరిక తీరేది.
ఆయన తరువాత ముద్రగడ పద్మనాభం దశాబ్దాల పాటు వారి శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. అనేక ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా మారారు. కానీ రాజ్యాధికారం దిశగా మాత్రం అడుగులు పడలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం టైం లో కూడా పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ ఫలితం రాలేదు.
విభజన ఏపీలో అయితే కాపులదే అధికారం అనుకున్నా రెండు బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ సుస్థిరం అయ్యాయి. ఇక జనసేన పార్టీ ఒక్కటే కాపులకు ఆశాదీపంగా మారింది. రెండు ఎన్నికలు ముగిసి మూడు ఎన్నికలలోకి ఏపీ అడుగుపెట్టింది. కానీ జనసేన పొత్తు పార్టీగానే ఉంది.
ఆ పొత్తులో అయినా రాజకీయం బేరం ఆడి తగిన దామాషాలో సీట్లు తీసుకుని అధికారంలో వాటా తీసుకోవాలని కాపు పెద్దలు సూచిస్తూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ మాత్రం తనకు ఎవరూ సలహా సూచనలు ఇవ్వనవసరం లేదని కుండబద్ధలు కొట్టారు. నా పార్టీ నా వ్యూహాలు నాకు ఉన్నాయని తెగేసి చెప్పారు.
దాంతో ప్రస్తుతం కాపు పెద్దలుగా ఉన్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, అలాగే ముద్రగడ పద్మనాభం వంటి వారు అంతా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇద్దరూ రెండు లేఖలు అయితే బహిరంగంగా రాసి మరీ తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
టీడీపీతో పొత్తుల ద్వారా కాపులకు న్యాయమైన వాటాను పవన్ సాధించలేకపోయారు అని ముద్రగడ విమర్శిస్తే నా సలహాలు అవసరం లేకపోతే మీకు నమస్కారం ఇక మీ ఇష్టం సెలవు అంటూ జోగయ్య తప్పుకున్నారు. ఇలా కాపు పెద్దలు సైడ్ అయిపోయారు. దాంతో వీరి ప్రభావం కాపు సమాజంలో ఎంతవరకూ ఉంటుంది అన్న చర్చ మొదలైంది.
పవన్ తో విభేదిస్తున్నట్లుగా వారి లేఖలు మాటల బట్టి అర్ధం అవుతోంది. అయినా కాపు సమాజంలో వారి వైపు ఉండేది ఎవరు అంటే ఇపుడు ఆలోచించాల్సిందే అంటున్నారు. కాపు యూత్ అంతా పవన్ తో నడుస్తోంది. పవన్ చెప్పాలే కానీ దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంది.
అదే టైం లో యువతకు పవన్ ఆరాధ్యదైవంగా మారారు. ఇక నడి వయసు వారు ఆ మీదట పెద్దలు అయితే ఆలోచినుకుని ఓటు చేస్తారు అని అంటున్నారు. కాపు పెద్దల మాటలు ఏమైనా వారిని ప్రభావం చేసే అవకాశం ఉండవచ్చు కానీ యువతలో మాత్రం పవన్ క్రేజ్ ని దెబ్బతీయలేవు అని అంటున్నారు.
పవన్ ఏమి చేసినా కరెక్ట్ అనే ఆలోచనలో యూత్ ఉంది. వారు ఆయన చెప్పినది వేదంగా భావిస్తారు. కుల పెద్దలు ఏది చెప్పినా కూడా వారికి పవన్ మాటే అల్టిమేట్. దాంతో కాపు నేతలు తమ తరానికి వర్తమాననికి అంతరం పెరిగింది అని గమ్మున ఉంటారా లేక కాపు జాతి మేలు కోసం మరో పోరాటం చేస్తారా లేక తమలో నుంచి కొత్త నాయకత్వాన్ని బిల్డప్ చేస్తారా అన్నది చూడాలి.
పవన్ తన వ్యూహాలు తనకు ఉన్నాయని చెప్పుకున్నారు. దాని ప్రకారం చూస్తే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు అయి అందులో జనసేనకు ప్రాధాన్యత దక్కితే మాత్రం పవన్ స్థానం బలమైన సామాజిక వర్గం మొత్తంలో సుస్థిరం అవుతుంది అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.