కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?

ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి సారించారు.

Update: 2023-11-14 17:30 GMT

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తోంది.. కరీంనగర్‌. ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం ఇక్కడ నుంచి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ బరిలో ఉండటమే. మరోవైపు ఆయన కరీంనగర్‌ ఎంపీగా కూడా ఉన్నారు.

2018లోనూ కరీంనగర్‌ అసెంబ్లీకి పోటీ చేసిన బండి సంజయ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌ సభా స్థానం నుంచి బరిలోకి దిగి బండి సంజయ్‌ గెలుపొందారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

కాగా బీఆర్‌ఎస్‌ తరఫున ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్‌ పోటీ చేస్తున్నారు. మున్నూరు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్న కరీంనగర్‌ నియోజకవర్గంలో విజేతలను ఆ సామాజికవర్గంతోపాటు ముస్లింలు నిర్ణయించనున్నారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న బండి సంజయ్, బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న గంగుల కమలాకర్‌ ఇద్దరూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. ఇక కాంగ్రెస్‌ తరఫున పురుమళ్ల శ్రీనివాస్‌ పోటీ చేయనున్నారు. ఈయన సైతం మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇలా అన్ని ప్రధాన పార్టీలు మున్నూరు కాపులకే సీట్లు కట్టబెట్టాయి.

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,40,520 మంది ఉండగా వీరిలో 60 వేలకు పైగా మున్నూరు కాపులు ఉన్నారు. 68 వేలకు పైగా ముస్లింలు ఉండటం విశేషం. వీరి తర్వాత వెలమలు దాదాపు 40 వేలు, రెడ్లు 22 వేల ఓటర్లు ఉన్నారు.

కరీంనగర్‌ స్థానంలో గతంలో వెలమ సామాజికవర్గం బలంగా ఉంది. ఆ సామాజికవర్గం తరపున పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మున్నూరు కాపులు దూసుకొచ్చారు.

ఇక గెలుపు ఓటముల విషయానికొస్తే బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ బండి సంజయ్‌ బీజేపీ సీఎం అభ్యర్థుల జాబితాలో ఉన్నారని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. గత మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బండి సంజయ్‌ ఓడిపోయారు. ఈ సానుభూతి, ప్రధాని మోదీ ఆకర్షణ తనకు కలసి వస్తుందని సంజయ్‌ భావిస్తున్నారు.

ఇక గంగుల కమలాకర్‌ నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సృష్టించారు. మంత్రిగా ఉండటం, ఆర్థిక బలం పుష్కలంగా ఉండటం కమలాకర్‌ బలాలు.

ఇక కరీంనగర్‌ రూరల్‌ మండల జేడ్పీటీసీగా చేసిన పురుమళ్ల శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. ఆయన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇమేజ్‌ తో పాటు బీఆర్‌ఎస్‌ పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News