సంసారంలో బెట్టింగ్ భూతం.. కోటి లాస్.. భార్య ఆత్మహత్య
కర్ణాటక చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు ఇంజనీర్. ఈయనకు క్రికెట్ అంటే పిచ్చి. 2021 నుంచి ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బెట్టింగ్ కు అలవాటుపడ్డాడు.
మనుషులకు ఉన్న అనేక వ్యసనాల్లో అత్యంత ప్రమాదకరమైనది బెట్టింగ్. అయితే, బెట్టింగ్ అనేది కొందరికి మజా ఇస్తుంది. డబ్బు పోగొట్టుకున్నవారికి మళ్లీ అక్కడే సంపాదించవచ్చు అనే భ్రమను కూడా కల్పిస్తుంది. చివరకు సాధించేది ఏమీ ఉండదని తెలుసుకునే సరికి విలువైన సమయం, డబ్బు కోల్పోయి నిరాశలో కూరుకుపోతుంటారు. ఆర్థికంగా పతనం అవుతుంటారు. మరోవైపు ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ భూతం రాజ్యం ఏలుతోంది. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చాక ప్రతి ఒక్కరూ దానికి బానిసగా మారారు. కొందరైతే ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు పోగొడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఇటీవల ఓ మహిళ తన భర్త సంపాదించి ఇచ్చిన రూ.16 లక్షలను ఇలానే ఆన్ లైన్ గేమ్స్ ఆడి పోగొట్టారు. ఇక క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక బెట్టింగ్ మరో రూపం తీసుకుంది. పల్లెల నుంచి నగరాల దాక, చిన్నా పెద్ద, చదువుకున్నవారు, చదువు లేనివారు, నిరుద్యోగులు, ఉన్నత ఉద్యోగులు అందరూ బెట్టింగ్ కు అలవాటు పడ్డారంటే ఆశ్చర్యం ఏమీ లేదు.
ఎక్కడంటే అక్కడ బెట్టింగ్ మరో విషయం ఏమంటే.. బెట్టింగ్ కు ఇది ఫలానా ప్రదేశం అని కూడా ఏమీ లేదు. బార్లు, రెస్టారెంట్లు, దాబాలు వీటికి ప్రధాన కేంద్రాలు. ఇక కొందరు గ్రౌండ్ లోనే బెట్టింగ్ వేస్తున్నారు. అయితే, ఇలాంటివి చిన్న స్థాయిలో ఉంటే ఫర్వాలేదు. కానీ, పరిధి మించితేనే జీవితాలను అంతం చేసుకునేంత వరకు వెళ్తారు.
రూ.కోటి పోగొట్టని ఇంజనీర్ కర్ణాటక చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు ఇంజనీర్. ఈయనకు క్రికెట్ అంటే పిచ్చి. 2021 నుంచి ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బెట్టింగ్ కు అలవాటుపడ్డాడు. డబ్బు పోయినప్పుడల్లా అప్పు చేసేవాడు. ఇలా రూ.కోటి వరకు బాకీ పడ్డాడు. దీంతో అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. దర్శన్ అందుబాటులో లేకుంటే అతడి భార్య రంజిత (23)ను నిలదీసేవారు. దీంతో ఈ వేధింపులు తాళలేక ఆమె ఈ నెల 18న ఉరివేసుకుని చనిపోయింది. దర్శన్, రంజితలకు 2020 సంవత్సరంలో వివాహమైంది. ఆ తర్వాత రెండేళ్లకే దర్శన్ బెట్టింగ్ లకు అలవాటుపడ్డాడు. నాలుగేళ్లలోనే వారి సంసారం చెల్లాచెదురింది. గమనార్హం ఏమంటే దర్శన్ అప్పులు రూ.కోటిన్నర పైనే. ఇందులో రూ.కోటివరకు చెల్లించాడు. ఇంకా రూ.84 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. దర్శన్, రంజిత్ కు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రంజితను వేధించినందుకు 13 మంది అప్పుల వాళ్లపై కేసు నమోదైంది.