వైసీపీ ఓటమికి కొత్త కారణం చెబుతున్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే!
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... తాము గడప గడపకూ వెళ్లినప్పుడు జనం ఎక్కువగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో... తమ ఓటమికి, పార్టీ ఘోర ఓటమికి కారణాలు చెబుతూ ఒక్కక్కరుగా మైకులముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్ రెడ్డి స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తమ ఘోర ఓటమి నుంచి కాస్త తేరుకునో.. లేక, బయటకు చెప్పుకుంటే కాస్త బాధ తగ్గుతాదనో తెలియదు కానీ.. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మైకుల ముందు తమ ఆవేదనను వెళ్లడిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే తమ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కారణం అని ఒకరంటే... ఐప్యాక్ కూడా కారణం అని మరొకరు చెబుతున్నారు.
ఇదే సమయంలో... వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ లతో పాటు ప్రధానంగా సీఎంవో లోని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం అని.. సీఎం కు ఎమ్మెల్యేలకు వీరు అడ్డుగోడలుగా మిగిలారని అంటున్నారు. ఈ సమయంలో సరికొత్త కారణంతో తెరపైకి వచ్చారు రాంభూపాల్ రెడ్డి. ఇందులో భాగంగా... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ కొంపముంచిందని తెలిపారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... తాము గడప గడపకూ వెళ్లినప్పుడు జనం ఎక్కువగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని జగన్ దృష్టికీ, అధికారుల దృష్టికీ తీసుకెళ్లినా తమ గోడు ఎవరూ వినలేదని చెప్పారు. దీంతో... ప్రత్యర్థులు పనిగట్టుకుని ఈ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారని స్పష్టం చేశారు.
ఫలితంగా చివరి పదిరోజుల్లో సీన్ మొత్తం మారిపోయిందని.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఈ ప్రచారాన్ని బాగా నమ్మారని.. పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు పెట్టుకున్నారని, లాక్కుంటారనే ప్రచారాన్ని చాలా మంది నమ్మారని.. తమ భూములు లాక్కుంటారనే భయంతో టీడీపీకి ఓటు వేసినట్టు ప్రజలు చెబుతున్నారని రాంభూపాల్ రెడ్డి వాపోయారు.