ఆంధ్రా పాలకులే రేవంత్ శత్రువులు.. నీళ్ల మంటల్లో కవిత నిప్పులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా తెరపైకి వచ్చి శుక్రవారం తన సంస్థ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు -నిజాలు’ హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
నీళ్లు నిధులు నియామకాల నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదాక విశ్రమించలేదు. పదేళ్లు బీఆర్ఎస్ హయాంలోనూ ‘నీటి’ అంశాలే ప్రధానంగా నిలిచాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ మరోసారి నీటి విషయం మంటలు రేపేలా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా తెరపైకి వచ్చి శుక్రవారం తన సంస్థ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు -నిజాలు’ హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సాగునీటి విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కేసీఆర్ కాళేశ్వరం వంటి అత్యద్భుత ప్రాజెక్టును నిర్మించారని కొనియాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం, గోదావరి వరదను తట్టుకుని అందులోని మేడిగడ్డ బ్యారేజీ మేరు నగధీరుడిలా నిలిచిందన్నారు. కేసీఆర్‌ను శత్రువుగా భావిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు శత్రువలని గమనించాలని.. కేసీఆర్ ప్రారంభించిన పనులను కొనసాగించాలని
ఆంధ్రా కేడర్ లో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ను బాధ్యతల నుంచి తప్పించి కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున బలంగా వాదనలు వినిపించాలని కవిత కోరారు. ఉమ్మడి ఏపీలో 60 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించారని.. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లలో కోటి ఎకరాలకు పైగా నీళ్లందించినట్లు చెప్పారు.
జల వనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని కవిత విమర్శించారు.కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, సాగు నీటి శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టి చేతగాని తనాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు.