అప్పటి వరకు కవిత ఆగాల్సిందే !
జులై 1న హైకోర్టు తిరిగి ప్రారంభం కానుంది. దీంతో జూలైలోనే కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు రానున్నట్లుగా తెలుస్తోంది.
మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తీర్పుపై మరికొంత సమయం పట్టేలా ఉంది. జూన్ 1 నుంచి ఢిల్లీ హైకోర్టుకు వేసవికాలం సెలవులు కావడంతో బెయిలు విషయంలో తీర్పు మరింతగా ఆలస్యం కానుంది. జులై 1న హైకోర్టు తిరిగి ప్రారంభం కానుంది. దీంతో జూలైలోనే కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు వస్తుందని కవిత తరుపు న్యాయవాదులు ఎదురుచూశారు.
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఇప్పటికే ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్ట్ జరిగినట్లు కవిత తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. జూన్ 3తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు. కవిత బయటకు రావడం నెల తర్వాత వచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.