తెలంగాణ తల్లి విగ్రహం నాలాగా ఉందంటే.. ఇక్కడి ఆడబిడ్డను కాదా?

ఇటీవల కేబినెట్ భేటీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు.

Update: 2024-02-08 07:17 GMT

బీఆర్ఎస్ కు చెందిన గత ప్రభుత్వ విధానాలను తవ్వితీస్తూ, నిర్ణయాలను తిరగదోడుతూ, పథకాలను సమీక్షిస్తూ రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ క్రమంలో ఏకంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణను ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించింది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా తీసుకొచ్చిన విగ్రహం. రాష్ట్రం ఏర్పడడం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో అదే తెలంగాణ తల్లి విగ్రహం అధికారికమైంది.

ఇప్పుడున్నది ఇలా..

ఇటీవల కేబినెట్ భేటీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని పోలి ఉందంటూ విమర్శలు వస్తున్నాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న మొక్క కంకులు, మరో చేతిలో బతుకమ్మతో ఉన్న ఈ విగ్రహాన్నిహైదరాబాద్‌ లో 2017 డిసెంబరు లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు నివాళిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ద్వారా రూపొందించారు. అయితే, దీనికి మార్పులు చేయాలని గతంలోనే కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీభవన్ లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపొందించింది. ఆ విగ్రహం చేతిలో చెరుకు గడ, మొక్కజొన్న కంకులు ఉన్నాయి. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిపిన రూపంలో మన తెలంగాణ తల్లిని కొలుద్దామంటూ గతంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ మార్పులనే ప్రభుత్వం తెస్తుందా..? అనేది వేచి చూడాలి.

ఆ వ్యక్తి కవితనేనా.??

కాగా, మంత్రివర్గ భేటీలో తెలంగాణ తల్లి ప్రస్తుత విగ్రహం ఒక వ్యక్తి రూపంలో ఉందంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెను ఉద్దేశించినదే అని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె స్పందించారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. నేనూ తెలంగాణ ఆడబిడ్డనే కదా?’’ అని ప్రశ్నించారు.

సగటు మహిళగా..

తెలంగాణ తల్లి విగ్రహ రూపం సగటు తెలంగాణ మహిళా ఉంటుందని సీఎం రేవంత్ రెండు రోజుల కిందట ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంటే.. దీనర్థం ఇప్పటివరకు ఉన్న విగ్రహంలో అలాంటి రూపం లోపించిందనే. వాస్తవానికి సగటు తెలంగాణ మహిళ రూపం.. ప్రస్తుతం విగ్రహంలో లేవు. శ్రామిక రూపం.. తెగించి కొట్టాడే స్వభావం.. కష్టాన్ని భరించే ఓపిక.. బతుకు బండిని లాగే నేర్పు వంటి లక్షణాలతో కాకుండా కాస్త బలీయంగా, ఆధునికంగా ఉన్నది ప్రస్తుత విగ్రహం. కాంగ్రెస్ సర్కారు తీసుకురానున్న విగ్రహం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News