537 పేజీలతో సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అరెస్టు అయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం తెలిసిందే
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అరెస్టు అయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం తెలిసిందే. ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న ఆమె.. విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉంటే తనను అరెస్టు చేసిన తీరు అక్రమం అని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ సందర్భంగా ఆమె తరఫు న్యాయవాదులు 537 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించిందని.. ఈడీ మీద చర్యలు తీసుకోవాలని పేర్కొనటం ఒక ఎత్తు అయితే.. అరెస్టు సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వులోని అంశాలన్ని అబద్ధాలుగా పేర్కొన్నారు. మద్యం కేసుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా ఈడీ వద్ద లేవని.. అందుకే తనను తక్షణం విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. సుదీర్ఘ వివరణలో కూడిన అంశాల్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉందని.. అయినప్పటికీ ఈడీ అధికారులు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తనను అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక.. నిస్సహాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో వందలకోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా ఈడీ ఆరోపిస్తోందని.. కానీ ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయినట్లుగా ఆరోపించారు. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉందన్న ఆమె.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాలంటూ తన వాదనల్ని పేర్కొన్నారు. అయితే.. ఈడీ అధికారులు వీటిని ఫాలో కాలేదని ఆరోపించారు.
అరెస్టు చేసే ముందు తన వద్ద ఉన్న సాక్ష్యాధారాల్ని లిఖిత పూర్వకంగా నమోదు చేయాల్సి ఉండగా.. వాటిని ఈడీ పట్టించుకోలేదన్నారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19ను మహిళపై ప్రయోగించటాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించాలన్న ఆమె.. ఈనెల 15న ఈడీ తనను అరెస్టు చేసిన తర్వాతి రోజే ప్రత్యేక కోర్టు తనను రిమాండ్ కు పంపినట్లుగా పేర్కొన్నారు. ఇదంతా పూర్తిగా యాంత్రికంగా జరిగిందే తప్పించి.. నిబంధనల ప్రకారం సాగలేదన్నారు.
తనకు దర్యాప్తు సంస్థల సమన్ల జారీపై గతంలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో విచారణ పూర్తి అయ్యే వరకు సమన్లు ఇవ్వబోమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిందని.. కానీ ఆ హామీని ఉల్లంఘించినట్లుగా కవిత పేర్కొన్నారు. తన అరెస్టు అక్రమమని.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంటూ దర్యాప్తు సంస్థలపూ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు. మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలవకుండా ఇంటి వద్దనే విచారణ చేయాలని కోరుతూ గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.