కవితకు ఎంపీ టిక్కెట్ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!
ఇందులో భాగంగా ప్రధానంగా పార్టీపై ఉన్న "కుటుంబ పాలన" పేరును చెరిపేయాలని.. ఆ ట్యాగ్ ని చింపి పడేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈసారికూడా గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని బీఆరెస్స్ నేతలు భావించినా... తెలంగాణ ప్రజానికం మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు! ఫలితంగా బీఆరెస్స్ కు రివర్స్ ఫలితాలు వచ్చాయి.. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో బీఆరెస్స్ ముందు మరో సవాల్ సిద్ధంగా ఉంది.
అవును... ఇటీవలి ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బీఆరెస్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు. వీలైనన్ని ఎంపీ సీట్లలో గెలిచి.. తెలంగాణలో కారు జోరు తగ్గలేదని నిరూపించుకోవడం ఇప్పుడు అనివార్యం. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా ప్రధానంగా పార్టీపై ఉన్న "కుటుంబ పాలన" పేరును చెరిపేయాలని.. ఆ ట్యాగ్ ని చింపి పడేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా కవితకు ఎంపీ టిక్కెట్ ఇచ్చే విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఈసారి కవితకు ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని.. ఫలితంగా కుటుంబ పాలన ట్యాగ్ ని ఎంతో కొంత దూరం చేసుకున్నట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం!
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు అయిన కారణాలను కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరించాలని భావిస్తున్నారని.. అందులో భాగంగా ముందుగా ప్రక్షాళన తన ఇంటి నుంచే మొదలుపెట్టాలని తలస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా సీఎం కావడం, కేటీఆర్, హరీశ్ లు ఎమ్మెల్యేలుగా, కీలక శాఖలకు మంత్రులుగా పని చేయడం, ఆ తర్వాత కవిత కూడా ఎంపీగా పొటీచేయడం వంటివి బీఆరెస్స్ కు కుటుంబ పార్టీ ఇమేజ్ గట్టిగా అంటుకుందని చెబుతున్నారు.
ఈ క్రమంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణాలుగా చెబుతున్న... గత పదేళ్లుగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, ఈ క్రమంలోనే తన కుమార్తె కవితకు ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదనే ధీమాతో ప్రారంభించి సరిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఇది సంచలన నిర్ణయమే కాదు... సమాజంలోకి సరికొత్త సంకేతాలను పంపే నిర్ణయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... 2019లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కవిత... బీజేపీ నేత అరవింద్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె బీఆరెస్స్ కంచుకోట అయిన మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత విషయంలో కేసీఆర్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.