కవిత అరెస్ట్ : ఢిల్లీ నుంచి లేటెస్ట్ అప్డేట్!
కవితను విచారించేందుకు పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఇది అక్రమ అరెస్టు అని, బెయిల్ ఇవ్వాలని కవిత లాయర్ కోరారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కవిత ఇంటిలో సోదాలు జరిపాక ఆమెను అరెస్టు చేసిన ఈడీ తమ వెంట ఆమెను ఢిల్లీకి తీసుకువెళ్లింది. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఆమెను ఉంచారు. మార్చి 16న ఉదయాన్నే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి జస్టిస్ నాగపాల్ ముందు కవితను హాజరుపర్చారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను విచారించేందుకు ఆమెను పది రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుమతి, ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వచ్చారు. మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని కవిత తెలిపారు.
కాగా కవిత అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాడీవేడిగా వాదనలు సాగుతున్నాయి. కవిత తరఫున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి, ఈడీ తరఫున ఎన్‌కే మట్టా, హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవితను విచారించేందుకు పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఇది అక్రమ అరెస్టు అని, బెయిల్ ఇవ్వాలని కవిత లాయర్ కోరారు.
ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు నమోదయ్యాయి. అక్రమార్జన ద్వారా ఇండో స్పిరిట్‌లో భాగస్వామ్యం పొందారని, అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా వ్యవహారాలు నడిపారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇప్పటికే పలు ఆధారాలను ఈడీ సంపాదించిందని తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, అశోక్ కౌశిక్ తదితరులు ఇచ్చిన వాంగ్మూల్లాలోనూ కవిత పేరు ఉందని తెలుస్తోంది. దీంతో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మిగిలింది కేవలం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రమేనని చర్చ జరుగుతోంది.
అయితే అరవింద్ కేజ్రీవాల్ కు తాజాగా ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు పెట్టారు. బీఆర్‌ఎస్ శ్రణులు లాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా భారీగా భద్రత చర్యలు చేపట్టారు.
ఇంకోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు.