కేసీఆర్.. ‘ఆపరేషన్ పొంగులేటి’ షురూ!
తనకు అవసరమైతే వారిని చేరదీయడం.. లేదంటే వారిని తరిమేయడం సీఎం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య .
తనకు అవసరమైతే వారిని చేరదీయడం.. లేదంటే వారిని తరిమేయడం బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసిన వారందరూ చెబుతుంటారు. గతంలో మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర, ప్రముఖ సినీ నటి విజయశాంతి తదితరుల పార్టీలను టీఆర్‌ఎస్ లో విలీనం చేయించి.. తర్వాత వారిని పూర్తిగా సైడ్ చేసేయడం ఇందుకు నిదర్శనమంటారు.
ఇప్పుడు ఇదే కోవలో కేసీఆర్.. ‘ఆపరేషన్ పొంగులేటి’ని ప్రారంభించారని టాక్ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఒక లోక్ సభ స్థానం ఖమ్మం ఉంది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే టీఆర్‌ఎస్ గొప్ప ఫలితాలను ఏమీ సాధించలేకపోయింది. ఈ జిల్లా ఏపీతో సరిహద్దులు పంచుకుంటోంది. సహజంగానే ఆంధ్రాకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లు సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఆయనకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో పెద్ద అడ్డంకి ఎదురవుతోంది. 2014లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి జిల్లావ్యాప్తంగా తన అనుచరులను పెంచుకున్నారు. అన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగల స్థాయికి చేరుకున్నారు. వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే పొంగులేటి టీఆర్‌ఎస్ లో చేరారు.
అయితే పొంగులేటికి 2019లో కేసీఆర్ సీటు ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్ సభ సీటు ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇస్తామని పొంగులేటికి హామీ ఇచ్చినా ఏవీ కార్యరూపం దాల్చలేదు.
తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతో ఎదురుచూసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక లాభం లేదని ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. అంతేకాకుండా భారీ ఎత్తున వివిధ నియోజకవర్గాల బీఆర్‌ఎస్ నేతలను, కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్పించారు. ఖమ్మం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేస్తానని పొంగులేటి సవాల్ విసిరారు.
దీంతో కేసీఆర్ సైతం ఆపరేషన్ పొంగులేటికి శ్రీకారం చుట్టారు. ఆయనకు షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ముల్లును ముల్లుతోనే కోయాలన్నట్టు పొంగులేటి ప్రధాన అనుచరులపైన దృష్టి సారించారు. వారిని తిరిగి బీఆర్‌ఎస్ లోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు తెల్లం వెంకట్రావు, ఆయన భార్య ప్రవీణలతోపాటు దుమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు సీతమ్మతో సహా కొంతమందిని బీఆర్‌ఎస్ లోకి ఆకర్షించారు. వీరంతా కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ లో చేరారు. ఇలా వచ్చే ఎన్నికల నాటికి పొంగులేటిని రాజకీయంగా గట్టి దెబ్బ తీయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని టాక్ నడుస్తోంది.