20 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కేసీఆర్.. తెలంగాణ సభలో తొలిసారి

తెలంగాణ ఏర్పాటైన తర్వాత దాదాపు పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉన్నారు.

Update: 2024-07-25 09:27 GMT

తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సన్నివేశం.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇదే మొదటిసారి. అంతేగాక.. తొలిసారిగా ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ కు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పినా.. మరో 28 మంది సభ్యుల బలం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా దక్కేందుకు కావాల్సిన బలం 20. ఈ లెక్కన కేసీఆర్ క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవకాశం ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ గనుక మరింతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చకుంటేనే ఇది సాధ్యం.

చివరిగా టీఆర్ఎస్ తరఫున

తెలంగాణ ఏర్పాటైన తర్వాత దాదాపు పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉన్నారు. అంటే అధికార పార్టీ నేత.. ప్రభుత్వాధినేతగా కొనసాగారు. ఇప్పుడు గురువారం మాత్రం తెలంగాణ అసెంబ్లీకి తొలిసారిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా హాజరయ్యారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రారా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. దీనికితగ్గట్లే ఆయన రెండు సమావేశాలకూ హాజరుకాలేదు. అయితే, గురువారం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా సమాశాలకు వచ్చారు. కాగా, చివరిసారిగా కేసీఆర్ 2003-04లో ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి కేసీఆర్ ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు మాత్రం ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. 28 మంది ఎమ్మెల్యేలతో (కేసీఆర్ సహా) ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.

అప్పట్లో గాయపడి..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుడిన రోజు ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫాం హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ కిందపడడంతో తుంటి గాయమైంది. హైదరాబాద్ లో చికిత్స పొంది ఇక్కడే ఉండిపోయారు. తర్వాత చేతి కర్ర సాయంతో నడక మొదలుపెట్టారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ అలానే పాల్గొన్నారు. దీంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొలువుదీరిన అసెంబ్లీకి రాలేకపోయారు. తాజాగా బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. ఇంతటితో సరిపెడతారా? తర్వాతి సమావేశాలకూ వస్తారా? అనేది చూడాలి.

Tags:    

Similar News