బీఆర్ఎస్ మరీ ఇంత చీపా ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అగ్రనేతలు ఇంకా తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అగ్రనేతలు ఇంకా తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. ఎన్నికల్లో ఓడిపోయినపుడు కొద్దిరోజులు బాధుండటం మామూలే. అయితే దాన్ని అధిగమించి మళ్ళీ జనాల్లోకి వచ్చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారపార్టీకి అభినందనలు చెప్పి కొంతకాలం హనీమూన్ పిరీయడ్ ను ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పులుంటే జనాల్లోకి వెళ్ళి ఎండగడతారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కేటీయార్, హరీష్ రావులు శాపనార్ధాలు పెడుతుండటమే చాలా విచిత్రంగా ఉంది.
ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేస్తామని, తలచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామని, జనాలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కీలక నేతలంతా గోలగోల చేస్తున్నారు. ఈ గోలకు పరాకాష్టగా శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి వ్యవహారముంది. విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఇద్దరిని కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ను ఎంఎల్సీలుగా ప్రతిపాదించింది. ప్రభుత్వం ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై ఓకే చెప్పి ఆమోదించింది. గవర్నర్ నామినేషనే ఇక్కడ కీలకం. గవర్నర్ ఆమోదం అయిపోయింది కాబట్టి ప్రమాణస్వీకారం అన్నది కేవలం లాంఛనమే.
ఇక్కడే బీఆర్ఎస్ చవకబారుతనం బయటపడింది. మంగళవారం ఇద్దరు ఎంఎల్సీలు ప్రమాణస్వీకారం చేయటానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాంబర్ కు చేరుకున్నారు. అయితే అప్పుడు ఛైర్మన్ ఆఫీసులో లేరు. అందుకనే వీళ్ళు ఛైర్మన్ కు ఫోన్ చేశారు. తనకు అనారోగ్యంగా ఉంది కాబట్టి రాలేనని బుధవారం వస్తానని సమాధానమిచ్చారట. ఇక్కడే ఛైర్మన్ చీపు మెంటాలిటి వయటపడిందని కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు.
కోదండరామ్ ను ఎలాగైనా ఎంఎల్సీ కాకుండా అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి కూడా మండిపోయారు. మంగళవారం ఎంఎల్సీల ప్రమాణస్వీకారం వాయిదాపడటంతో ఏమైంది మధ్యాహ్నానికి కోర్టు స్టే ఇచ్చింది. విచారణ జరిగేంతవరకు ఎంఎల్సీలతో ప్రమాణస్వీకారం చేయించవద్దని ఛైర్మన్ను కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 8వ తేదీన విచారణ వాయిదా వేసింది. అయితే ఆ కేసు ఇక ఎప్పటికి తేలుతుందో ఎవరు చెప్పలేరు. నిజానికి గవర్నర్ నిర్ణయాన్ని కోర్టు అడ్డుకోలేందు. కాని ఏదో కారణంతో కొన్నిరోజులైతే కేసును లాగగలరు. ఇక్కడే బీఆర్ఎస్ చీపుమెంటాలిటి బయటపడిందని కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు.