చివరి కేబినెట్ డేట్ ఫిక్స్ చేసిన కేసీఆర్... గేమ్ ప్లాన్ పెద్దదే...
వివిధ వర్గాల సమాచారం ప్రకారం పలు కీలక అంశాలపై గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేసేశారట. కీలక అంశమై ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపైనా చర్చ జరిగే అవకాశముందని సమాచారం.
తెలంగాణలో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల బృందం అక్టోబర్ 3,4,5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసేశారు. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ప్రస్తుత కాలపరిమితిలోని చివరి కేబినెట్ సమావేశాలు కానున్నాయి.
ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో మంత్రివర్గం సమావేశం ఏర్పాటుపై సహజంగానే అన్నివర్గాల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. వివిధ వర్గాల సమాచారం ప్రకారం పలు కీలక అంశాలపై గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేసేశారట. కీలక అంశమై ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపైనా చర్చ జరిగే అవకాశముందని సమాచారం. దీంతోపాటుగా గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి నిర్ణయంపై సహచరులతో కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. గవర్నర్ తిరస్కరణ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలా..? లేదా ఇతరులను నామినేట్ చేయాలా..? అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
ఎన్నికల మేనిఫెస్టోపైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడే విషయాలను ఇప్పటికే గుర్తించిన గులాబీ దళపతి కేసీఆర్... వాటి అమలు చేసే విషయంలో మంత్రివర్గ సహచరులతో శాఖపరమైన చర్చ నిర్వహిస్తారని తెలుస్తోంది. బడ్జెట్ పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకొని అమలుకు సన్నద్ధం అవుతారని సమాచారం. మొత్తంగా ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ఉపయోగపడే వేదికగా ఈ చివరి కేబినెట్ సమావేశం ఉండనుందని స్పష్టం అవుతోంది.