తగ్గొద్దు: కొడుకు.. మేనల్లుడికి దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్
ఇలాంటివేళ..అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై కొడుకు కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ రావుకు పెద్దసారు కేసీఆర్ దిశానిర్దేశం చేయటం ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధి అనంతరం ఫాంహౌస్ లోని బాత్రూంలో గులాబీ బాస్ కేసీఆర్ జారి పడటం..తుంటి ఎముక విరగటం తెలిసిందే. అనూహ్యంగాఆసుపత్రి పాలైన ఆయన.. ఇటీవల డిశ్చార్జి అయి.. జూబ్లీహిల్స్ నందినగర్ లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జరిగిన చర్చల అనంతరం మూడు రోజుల గ్యాప్ అనంతరం బుధవారం నుంచి మళ్లీ మొదలు కానున్న సంగతి తెలిసిందే.
ఇలాంటివేళ..అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై కొడుకు కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ రావుకు పెద్దసారు కేసీఆర్ దిశానిర్దేశం చేయటం ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు వీలుగా విపక్షంలో ఉన్న గులాబీ జట్టు.. అధికారపక్షంపై విరుచుకుపడాలన్న దిశానిర్దేశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. శనివారం జరిగిన సభలో అధికారపక్షంపై కేటీఆర్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. గులాబీ నేతలు మాట్లాడేందుకు వీలుగా సభను నిర్వహించటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కాలంలో అధికారంలో ఉన్న వారి వాయిస్ తప్పించి.. విపక్ష నేతల మాటలు వినిపించేందుకు వీల్లేని రీతిలో అధికారపక్షం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికొత్తగా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఉండే అవకాశాలకు తగ్గట్లే.. విపక్షానికి ఉండాలన్నట్లుగా రేవంత్ సర్కారు తీరు ఉంది. తాజాగా కేసీఆర్ తో జరిగిన భేటీలో.. రేవంత్ సర్కారుపై దూకుడును గులాబీ బాస్ స్వాగతించినట్లుగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఇదే దూకుడు కొనసాగించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. బుధవారం నుంచి జరిగే అసెంబ్లీసమావేశాల్లో పలు అంశాలు చర్చకు వస్తాయని.. వివిధ అంశాలపై రేవంత్ సర్కారు ఇచ్చే ప్రజెంటేషన్లు.. చేపట్టే చర్చ విషయంలోనూ ఎక్కడా తగ్గొదని.. బలమైన వాదనను వినిపించేలా వ్యవహరించాలన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చచినట్లుగా చెబుతున్నారు.
అసెంబ్లీ వేదికగా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని విడిచి పెట్టొద్దని.. ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉండాలని.. సమన్వయం చేసుకొని సాగాలంటూ కేటీఆర్.. హరీశ్ లకు కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు. తమ పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించే అవకాశాన్ని విడిచి పెట్టొద్దన్న మాట గులాబీ బాస్ చెప్పినట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేయాలన్న మాట కేసీఆర్ సూచన చేసినట్లుచెబుతున్నారు. కేసీఆర్ అకాంక్షలకు తగ్గట్లే సభ జరుగుతుందా? లేదంటే ఊహించలేని ట్విస్టులు చోటు చేసుకుంటాయా? అన్నది కాలమే సరైన రీతిలోసమాధానం ఇస్తుందని చెప్పాలి.