చంద్రబాబును చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందా?

గెలుపు మనలో ఉన్న బలహీనతల్ని.. లోపాల్ని కవర్ చేసేస్తూ ఉంటుంది.

Update: 2024-07-06 05:22 GMT

గెలుపు మనలో ఉన్న బలహీనతల్ని.. లోపాల్ని కవర్ చేసేస్తూ ఉంటుంది. అలాంటిది ఏకంగా అధికారమే చేతిలో ఉండి.. కోట్లాది మంది ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం రావటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి గురుతర బాధ్యత దక్కినప్పుడు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అదే సమయంలో తమలో ఉన్న లోపాల్ని అధిగమిస్తే మరింత బాగుంటుంది. కానీ.. అలాంటిదేమీ చేయకుండా.. తనకు మించిన తెలివైనోడు మరెవరూ ఉండరన్న రీతిలో విర్రవీగి.. వెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా గులాబీ బాస్ కేసీఆర్ నిలుస్తారని చెప్పాలి.

ఒకప్పటి తన గురైన చంద్రబాబు విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో తెలిసిందే. అంతేకాదు.. చంద్రబాబు ఓటమి కోసం కేసీఆర్ ఎంత కసిగా పని చేశారో చాలామందికి తెలిసిందే. అంత చేసినప్పటికీ.. ఆయన అనుకున్న ఫలితం దక్కలేదు. ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలతో డస్సిపోయి ఉన్నారు. ఇలాంటి వేళ.. కేసీఆర్ కు చంద్రబాబే దిక్కు అవుతారన్నమాట వినిపిస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోవటం పెద్ద విషయం కాదు. ఓటమి ఎదురైనప్పుడు.. గడ్డు పరిస్థితులు వరుస పెట్టి చుట్టుముడుతున్నప్పుడు ఓపిగ్గా ఉండటం.. స్థైర్యాన్ని కోల్పోకుండా క్యాడర్ ను కాపాడుకుంటూ ఉండటం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో చంద్రబాబును మెచ్చుకోకుండా ఉండలేం. ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత వ్యవహరించినప్పటికీ విపక్ష నేతగా ఆయన చాలానే సవాళ్లు ఎదుర్కొన్నారు.

దివంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారో తెలిసిందే. అందునా పదేల్ల పాటు చంద్రబాబు అధికారానికి దూరంగా ఉండటమే కాదు.. నిస్తేజంగా మారిన పార్టీ క్యాడర్ ను సమాయుత్తం చేసి.. ఎన్నికల్లో గెలుపొందటం.. అధికారాన్ని సొంతం చేసుకోవటం చూసిందే. కట్ చేస్తే.. పదేళ్ల తర్వాత చేతికి వచ్చిన అధికారాన్ని ఐదేళ్లకే చేజార్చుకున్నారు.

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని విషమ పరీక్షల్ని ఎదుర్కోవటంతో పాటు.. పార్టీని కాపాడుకోవటానికి చాలానే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల వెంటే ఉంటూ .. అధికార పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్లకు సమాధానాలు చెప్పటంతో పాటు.. అదే పనిగా టార్గెట్ అవుతున్న సొంతోళ్లను కాపాడుకోవటం.. వారికి అండగా ఉండే క్రమంలో ఎన్నిచీకాకుల్ని ఎదుర్కొన్నారో తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు చంద్రబాబు కష్టం ఎంతన్నది మాటల్లో చెప్పలేం.

అలాంటిది పదేళ్లు తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్.. ఎన్నికల్లో ఓటమి పాలైనంతనే కనిపించకుండా పోవటం.. ఫాంహౌస్ కు పరిమితం కావటం చూసినప్పుడు చంద్రబాబులో ఉన్నది.. కేసీఆర్ లో లేనిది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. గెలుపు వేళలో ఉండే ధీమా లెక్కలు వేరుగా ఉంటాయి. కానీ.. ఎప్పుడైతే తాము విపక్షంలోకి వెళ్లినప్పుడు మరింత యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా.. ఏమీ పట్టనట్లుగా వ్యవహరించటం పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

తనను నమ్మకున్న వారికి ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. అదే జరిగితే.. ఎదురయ్యే నష్టం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ కు అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు పవర్ లేని చంద్రబాబు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ.. ఓడిన వేళలో చంద్రబాబు ప్రదర్శించే పోరాటతత్త్వం.. కష్టపడటం మాత్రం కేసీఆర్ ఫాలో కావాల్సిందే. చంద్రబాబు నచ్చక పోవచ్చు. ఆయన ఊసు ఎత్తటానికి ఇష్టపడకపోవచ్చు. కానీ.. ఇప్పుడు అదే చంద్రబాబును స్ఫూర్తిగా చేసుకోవాల్సిన పరిస్థితి. కాల మహిమ అంటే ఇది కాదా?

Tags:    

Similar News