కాళేశ్వరానికి కరెంట్ కష్టాలు.. కేసీఆర్ కు కొత్త తలనొప్పి
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతల సమస్యతో పాటు కరెంటు కష్టాలు వస్తాయన్న అంచనా ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితి ఎప్పుడో కాదు..కీలకమైన ఎన్నికల వేళ తెర మీదకు వచ్చింది.
భారీ బడ్జెట్ తో కళ్లు చెదిరే అంచనాల కు అత్యంత భారీ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి క్లిష్టమైన పని ని పూర్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. విపక్షాల అభ్యంతరాల్ని లైట్ తీసుకొని.. తాను ఎలా అనుకుంటే అలా పూర్తి చేసిన కాళేశ్వరం రానున్న రోజుల్లో తెల్ల ఏనుగులా మారుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా.. వర్తమానం లోనే ఉక్కిరిబిక్కిరి అయ్యే సమస్యల్ని తెచ్చి పెడుతోంది ఈ బాహుబలి ప్రాజెక్టు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎత్తిపోతల సమస్యతో పాటు కరెంటు కష్టాలు వస్తాయన్న అంచనా ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితి ఎప్పుడో కాదు..కీలకమైన ఎన్నికల వేళ తెర మీదకు వచ్చింది. పంప్ హౌజ్ ల నిర్వహణ కు అవసరమైన నాన్ స్టాప్ విద్యుత్ ను సరఫరా చేసే విషయంలో తెలంగాణ ట్రాన్స్ కో సిద్ధంగా లేకపోవటం ఇబ్బందికరంగా మారింది.
ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో మాత్రమే విద్యుత్ ను వినియోగించుకోవటానికి వీలుగా నీటిపారుదల శాఖ అనుమతి ఇవ్వటంతో.. పంప్ హౌజ్ ను పూర్తి స్థాయిలో నడపలేని పరిస్థితి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే.. ప్రాజెక్టు నిర్వాహణ కు 5391 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 109 పంపులను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్.. రంగనాకమ్మ సాగర్ లోకి నీళ్లను ఎత్తి పోస్తున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ కు నీళ్లు ఎత్తి పోసే పంప్ హౌజ్ లో 106 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు పంపులు ఉంటే.. ఒక్క పంప్ ను మాత్రమే నడుపుతున్నారు. దాదాపు పది రోజుల పాటు పగటి వేళల్లో పంపుల్ని నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తి పోసినట్లుగా ఇరిగేషన్ శాఖ చెబుతోంది.
వర్షాలు పడటంతో ప్రస్తుతానికి ఎత్తిపోతల కార్యక్రమాన్ని ఆపింది. అయితే.. రెండు పంపుల్ని కలుపుకొని మొత్తం 240 మెగావాట్ల విద్యుత్ అవసరమైతే.. పగటిపూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్ కో అనుమతి ఇచ్చింది. వర్షాలు కురవనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని చెబుతున్నప్పటికీ.. అందుకోసం భారీగా విద్యుత్ సరఫరా అవసరం కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న యాదాద్రి 4వేల మెగావాట్లు.. తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ కు చెందిన 1600 మెగావాట్ల ప్రాజెక్టులు పూర్తి అయితే తప్పించి కరెంట్ కష్టాలు తీరవంటున్నారు. అప్పటివరకు కాళేశ్వరానికి కరెంటు కష్టాలు కామన్ అని చెప్పక తప్పదు.