మళ్ళీ జగనే...కేసీఆర్ మార్క్ సంచలనం !
ఇదే ప్రశ్నను బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ని ఒక టీవీ చానల్ ప్రతినిధి అడిగితే ఆయన చాలా నర్మగర్భంగా సమాధానం చెప్పారు.
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటే సాధారణంగా జవాబు చెప్పడం కష్టమే అని అంటారు అంతా. ఎందుకంటే ఏపీలో ఉన్న రాజకీయాలు అలాంటివి మరి. ఇదే ప్రశ్నను బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ని ఒక టీవీ చానల్ ప్రతినిధి అడిగితే ఆయన చాలా నర్మగర్భంగా సమాధానం చెప్పారు.
ఏపీలో అందరూ తనకు మిత్రులే అంటూ జగన్ అన్న పవన్ అన్న లోకేష్ తమ్ముడు అని వరసలు కలిపారు తప్ప ఎవరూ అన్నది చెప్పలేదు. అయితే కేసీఆర్ ని ఇదే ప్రశ్న అడిగితే మాత్రం ఆయన రెండవ మాట లేకుండా చెప్పేశారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో అధికారంలోకి మళ్ళీ వచ్చేది జగన్ అని తేల్చేశారు.
అయితే తెలంగాణా రాజకీయాల మీద సదరు చానల్ ప్రతినిధి కేసీఆర్ ని ఎన్నో ప్రశ్నలు అడిగారు. కానీ చివరిలో ఏపీలో రాజకీయాల గురించి ఆసక్తికరమైన ప్రశ్నలే వేశారు. ఏపీలో జగన్ ని ఓడించడానికి అన్ని పార్టీలూ ఏకం అయ్యాయని ఎవరు ఈసారి అధికారంలోకి వచ్చేది అని కేసీఆర్ ని సూటిగానే అడిగారు. దానికి జగన్ అన్నది కేసీఆర్ ఇచ్చిన జవాబు.
వాస్తవానికి కేసీఅర్ ఇపుడే కాదు ఎపుడూ జగన్ పేరే చెప్పారు. విభజన తరువాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది. తొలి ఎన్నిక 2014లో జరిగితే ఆనాడు కూడా ఏపీలో జగన్ గెలుస్తారు అని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక 2019లో కేసీఆర్ తెలంగాణాలో రెండోమారు అధికారంలోకి వచ్చారు. ఏపీలో జగన్ కి ఆయన అన్ని రకాలుగా సాయపడ్డారు అని కూడా వార్తలు వచ్చాయి.
పైగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఇపుడు మూడోసారి ఏపీలో ఎన్నికలు. ఇపుడు కూడా గెలిచేది జగన్ అనే కేసీఆర్ చెబుతున్నారు. కేసీఆర్ ఇలా చెప్పడానికి ఆయన వద్ద ఉన్న రాజకీయ ఆధారాలు సమాచారం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు.
రెండవ వైపు చూస్తే ఏపీలో చంద్రబాబు కేసీఆర్ కి రాజకీయ ప్రత్యర్ధి అని అంటారు. అదే విధంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి బాబు ఒకనాటి శిష్యుడు. దాంతో ఏపీలో టీడీపీ వస్తే కనుక రెట్టింపు బలం రేవంత్ కి వచ్చినట్లే అన్న లెక్కలేవో ఉన్నాయని అంటారు. ఏది ఏమైనా జగన్ గెలవాలని కేసీఆర్ ఎపుడూ కోరుకుంటారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ కేసీఆర్ ల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. మరి కేసీఆర్ జోస్యం నిజమవుతుందా లేదా అన్నది జూన్ 4న వచ్చే ఫలితాలే చెబుతాయి.