సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. అతడెవరంటే?
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున సభల్ని నిర్వహిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున సభల్ని నిర్వహిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గురువారం నర్సాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఒక యువకుడి నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న వైనం కలకలాన్ని రేపింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పలు విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి పాల్గొనే సభకు వచ్చిన యువకుడి నుంచి బుల్లెట్లు లభించటం కలకలాన్ని రేపింది.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఎండీ అస్లాం తన మామ నిర్వహిస్తున్న చికెన్ షాపులో పని చేయటంతోపాటు.. యూట్యూబ్ చానల్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు నర్సాపూర్ వచ్చాడు. విలేకరుల గ్యాలరీలోకి అగడు వస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాను విలేకరినని చెప్పటంతో గుర్తింపు కార్డు చూపించాలని కోరారు.
ఈ క్రమంలో తన పర్సు నుంచి గుర్తింపు కార్డు తీసే క్రమంలో అతడి పర్సులో రెండు బుల్లెట్లు కనిపించటంతో పోలీసులు అలెర్టుఅయ్యారు. అతను ఒక యూట్యూబ్ చానల్ విలేకరిగా గుర్తింపు కార్డు ఉంది. 2016 లో ఎన్ సీసీ శిక్షణలో పాల్గొన్నట్లుగా గుర్తింపు కార్డు ఉంది. ఇంతకూ.. బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని విచారించగా.. ఎన్ సీసీ క్యాంపు కార్యాలయం వద్ద రెండు బుల్లెట్లు దొరికాయని.. దీంతో తనతో ఉంచుకున్నట్లుగా తెలిపారు. తాను బీఆర్ఎస్ అభిమానినని.. పార్టీకి అనుుకూలంగా పోస్టులు పెడుతుంటానని చెప్పటం గమనార్హం. అతడ్ని మరింత లోతుగా విచారిస్తున్నారు.