బీజేపీ చెంతకు.. కేసీఆర్‌ వ్యూహం ఇదే!

అయితే తమంతట తాముగా బీజేపీని సంప్రదించడం కరెక్ట్‌ కాదని కేసీఆర్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు. బీజేపీనే తమను సంప్రదించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారని అంటున్నారు.

Update: 2024-02-20 06:39 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చేతిలో చావుదెబ్బతిన్న బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో 17 లోక్‌ సభా స్థానాలు ఉండగా వీటిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆశలు నెరవేరేలా లేవని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరిపోవాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ కూడా ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు తమతో పొత్తుకు సంప్రదిస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. మరోవైపు కేసీఆర్‌ కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్‌ రావు సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్‌ కు సూచిస్తున్నట్టు సమాచారం.

అయితే కేసీఆర్‌ తనయుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాత్రమ బీజేపీతో పొత్తుకు సిద్ధంగా లేరని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ ను బలోపేతం చేద్దామని ఆయన తన తండ్రికి చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా ఎన్డీయే కూటమిలో చేరాలని పలు పార్టీలకు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో చేరి చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే తమంతట తాముగా బీజేపీని సంప్రదించడం కరెక్ట్‌ కాదని కేసీఆర్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు. బీజేపీనే తమను సంప్రదించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పట్ల సాఫ్ట్‌ కార్నర్‌ చూపుతారని పేరున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ద్వారా బీజేపీ అగ్ర నేతలకు తాము ఎన్డీయేలో చేరడానికి సిద్ధంగానే ఉన్నామని కేసీఆర్‌ ఫీలర్‌ పంపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

నేరుగా బీజేపీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించి ఎన్డీయేలో చేరతామని చెప్పడం సరికాదని కేసీఆర్‌ తన పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. ఇందుకు బదులుగా బీజేపీయే తమతో పొత్తుకు ముందుకు రావాలని.. అలా అయితేనే బీఆర్‌ఎస్‌ కు ఏతావాతా లాభం ఉంటుందని చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయి ప్రధాని మోదీని తిట్టిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు లాంటివాళ్లు తిరిగి ఎన్డీయేలో చేరిపోతున్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటిది తాము చేరినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌ కు చెప్పినట్టు తెలిసింది.

అయితే కేసీఆర్‌ మాత్రం మనంతట మనంగా బీజేపీ నాయకత్వాన్ని సంప్రదించొద్దని సూచించినట్టు చెబుతున్నారు. బీజేపీయే స్వయంగా మన పార్టీ మద్దతు అడిగితే అప్పుడు ఆలోచిద్దామని తెలిపినట్టు సమాచారం. ఒకవేళ కేసీఆర్‌ ఎన్డీయేలో చేరడానికి సిద్ధపడితే అందుకు ప్రధాని మోడీ అంగీకరిస్తారా అనేది వేయి మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Tags:    

Similar News