ఇదేం లొల్లి.. కేసీఆర్ కు బీపీ పెంచేస్తున్నారే!
బీఆర్ఎస్ పార్టీ తరఫున గత 2023 ఎన్నికల్లో ఎన్నికైన వారు ఇప్పటికే పది మంది పార్టీ మారిపోయారు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తన వారే బీపీ పెంచేస్తున్నారు. బీఆర్ ఎస్ పార్టీ తరఫున గత 2023 ఎన్నికల్లో ఎన్నికైన వారు ఇప్పటికే పది మంది పార్టీ మారిపోయారు. ఒక్కొక్కరుగా కొందరు.. గుంపులుగా మరికొందరు పార్టీ మారారు. ఇక, ఎమ్మెల్సీలది కూడా అదే బాటగా మారింది. అరడజను మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారిపోయారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న తీర్మానం ఇచ్చేందుకు వెళ్లిన సమయంలోనే కొందరు రాలేదు. దీంతో వారంతా డుమ్మా కొట్టినట్టేనని.. పార్టీ నుంచి జంప్ ఖాయమని అనుకున్నారు.
కానీ, ఎందుకో ఆగింది. అయితే.. మరో టెన్షన్ తెరమీదికి వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న విషయం పై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. అయితే.. ఈ సమావేశానికి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. అంతేకాదు.. వారి ఫోన్లు కూడా.. స్విచ్ఛాఫ్ రావడంతో కేసీఆర్‌కు తిక్కరేగింది. ``పోనీ.. లండీలు`` అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కీలకమైన ఈ సమావేశంలో పార్టీ అనుసరించే విధానాలను ఎమ్మెల్యేలకు స్వయంగా వివరించాలని నిర్ణయించుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన పద్ధతులను .. పార్టీ వాయిస్‌ను కూడా వివరించాలని బావించారు.
కానీ, కీలకమైన ఈ సమావేశానికి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. వీరిలో ఎమ్మెల్యేలు మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, తిగుళ్ల పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామిరెడ్డి, గోరేటి వెంకన్న, వెంకట్రాంరెడ్డి, అటెండ్ కాలేదు.
దీంతో కేసీఆర్ కు సహజంగానే ఆగ్రహం వచ్చింది. అయినా.. తమాయించుకుని వారి ప్రస్తావన లేకుండానే కార్యక్రమాన్ని కొనసాగించారు. మరి వీరు పార్టీలో ఉంటారా? ఉండరో చూడాలి. కొన్నాళ్లుగా గోరటి వెంకన్న తటస్థంగా ఉంటున్న విషయం తెలిసిందే.