ఏడాదిలో కేసీఆర్ పార్టీకి వచ్చిన విరాళాలు అన్ని వందల కోట్లా?

కీలకమైన ఎన్నికల వేళ.. గులాబీ పార్టీ తనకు అధికారికంగా వచ్చిన విరాళాల లెక్కల్ని వెల్లడించింది.

Update: 2023-11-24 04:36 GMT

కీలకమైన ఎన్నికల వేళ.. గులాబీ పార్టీ తనకు అధికారికంగా వచ్చిన విరాళాల లెక్కల్ని వెల్లడించింది. తాజాగా ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి తనకు వచ్చిన విరాళాల లెక్కలకు సంబంధించిన వివరాల్నిఅందించింది. 2022-23 సంవత్సరానికి గాను తమ పార్టీకి మొత్తం రూ.683 కోట్ల విరాళాల రూపంలో అందినట్లుగా పేర్కొంది. తమకు వచ్చిన విరాళాల్లో ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా ఎంత వచ్చింది? ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ఫండ్ ద్వారా వచ్చిన వివరాల్ని వెల్లడించారు.

బీఆర్ఎస్ సమర్పించిన లెక్కల ప్రకారం ఆ పార్టీకి ఏడాది వ్యవధిలో వచ్చిన విరాళాల్లో అత్యధికం ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారానే రూ.529 కోట్లు వచ్చినట్లుగా పేర్కొంది. అదే సమయంలో ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ఫండ్ ద్వారా రూ.90 కోట్ల మేర విరాళాలు అందినట్లుగా తెలిపింది. ఇక.. వ్యక్తిగతంగా ఆయా వ్యక్తులు.. సంస్థల నుంచి విరాళాల రూపంలో వచ్చిన వివరాల్ని వెల్లడించింది.

అందులో టాప్ స్థానంలో మంత్రి గంగుల కమలాకర్ ఉండటం విశేషం. ఆయన పార్టీకి రూ.10 కోట్ల మేర విరాళాలు ఇచ్చినట్లుగా తెలిపింది. గంగుల తర్వాతి స్థానంలో మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఆయన రూ.4 కోట్లు ఇవ్వగా.. పలు సంస్థలు కూడా భారీగా విరాళాలు ఇచ్చినట్లుగా పార్టీ సమర్పించిన వివరాల్ని చూస్తే అర్థమవుతుంది. గాయత్రీ గ్రానైట్స్ రూ.10 కోట్లు కాగా.. హన్స్ పవర్ కంపెనీ రూ.10 కోట్లు.. ప్రముఖ రియాల్టీ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ రూ.10 కోట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళలో ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి.


Tags:    

Similar News