సీరియస్ టాపిక్: గులాబీ అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్ క్లాస్

పార్టీకి చెందిన నిఘా విభాగం ఇచ్చిన నివేదికను ముందుపెట్టుకున్న ఆయన పలువురు అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి లైన్లోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు.

Update: 2023-11-27 03:58 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. కీలకమైన పోలింగ్ కు కేవలం మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో.. ఆయా పార్టీల అగ్రనేతల నుంచి అభ్యర్థుల వరకు తమ ప్రచారాన్నితీవ్రతరం చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న వేళ.. కొందరు అభ్యర్థుల వ్యవహారశైలి మీద గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందరినోట వినిపిస్తున్న కాంగ్రెస్ గాలి నేపథ్యంలో.. తమ పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు పార్టీ పంపిన ఫండ్ ను ఖర్చు పెట్టకుండా ఉండటంపై కేసీఆర్ గరంగరంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్న మాట వినిపిస్తున్న వేళ.. శనివారం మొత్తం పార్టీ అభ్యర్థుల లెక్కలు.. వారిలో ఎవరు బలంగా ఉన్నారు? ఎవరు బలహీనంగా ఉన్నారు? ఖర్చు చేస్తే గెలిచే వారెవరు? అసలు ఖర్చు చేయని వారెవరు? ప్రజల్లో పార్టీకి అవకాశం ఉన్నప్పటికీ కొందరు అభ్యర్థుల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గాలు ఏమిటి? లాంటి కీలక అంశాలపై ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు.

పార్టీకి చెందిన నిఘా విభాగం ఇచ్చిన నివేదికను ముందుపెట్టుకున్న ఆయన పలువురు అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి లైన్లోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. కీలకమైన ఎన్నికల వేళ తమకు అధినేత నుంచి ఫోన్ రావటంతో పలువురు ఆశ్చర్యపోవటం ఒక ఎత్తు అయితే.. పార్టీ ఫండ్ పంపినప్పటికీ ఎందుకు ఖర్చు చేయటం లేదంటూ కేసీఆర్ కడిగిపారేయటంతో పలువురు అభ్యర్థులు కంగుతిన్న పరిస్థితి.

పలు చోట్ల అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నాయకుల్ని కలుపుకుపోవటాన్ని ప్రస్తావించి క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలంటేనే కలుపుకుపోవటమని.. అందర్నీ కలుపుకుపోవలాని చెబుతున్నా.. తమ ఆదేశాల్ని వినని వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు జరిగిన తప్పుల్ని ఒప్పులుగా చేసుకోవటానికి అవకాశం ఉందని చెబుతూ.. పోలింగ్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. ఖర్చు గురించి కూడా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అభ్యర్థులు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు పార్టీ ఫండ్ పంపిన తర్వాత కూడా ఖర్చు విషయంలో ఎందుకు వెనుకాడుతున్నారన్న ప్రశ్నను సంధించటంతో సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందంటున్నారు. కేసీఆర్ క్లాస్ నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News