వీర విధేయుడి వెన్నుపోటు.. కవిత ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారా?
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమాలు నడపడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమాలు నడపడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. 2020 నుండి నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేశారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో పార్టీ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. దాంతో ఎమ్మెల్సీగా గెలుపొందారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి విడుదలైన కవిత.. ఇప్పుడిప్పుడే యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చారు. పలు రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు.. రెగ్యులర్‌గా శాసనమండలి సమావేశాలకు హాజరవుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఇప్పటి నుంచే టార్గెట్ చేశారన్న టాక్ నడుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని సచివాలయం ముందు ఆవిష్కరించింది. దీనిని తీవ్రంగా నిరసిస్తూ కవిత పలు కార్యక్రమాలు చేశారు. తెలంగాణ సెంటిమెంటును మరోసారి రగిల్చేందుకు ఆమె 20 అడుగులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం భూమిపూజ చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన తెలంగాణ తల్లి రూపాన్ని అంగీకరించేదే లేదంటూ తేల్చిచెప్పారు.
ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల నుంచి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆమె జగిత్యాల నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు ఆమె ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. జగిత్యాల నుంచే పొలిటికల్ జైత్రయాత్ర ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారని ఆమె అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి జగిత్యాలను కంచుకోటగా మార్చే వ్యూహంతో ఉన్నారని సమాచారం.
గతంలో కవిత ఎంపీగా ఉండడతో ఎమ్మెల్యేగా పోటీచేయలేకపోయారు. దీంతో తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా పర్యటించారు. తానే అభ్యర్థి అన్నంత స్థాయిలో అందరి అభ్యర్థుల ప్రచారం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాలలోనూ బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. తనకు వీర విధేయుడిగా ఉన్న సంజయ్ కుమార్‌ను తెరమీదకు తీసుకొచ్చి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు.
అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కవిత పడిన కష్టం కాస్త వృథా అయింది. ఇక అప్పటి నుంచి జగిత్యాల నియోజకవర్గం రాజకీయాలు మారిపోయాయి. దీంతో అదే జగిత్యాలను కవిత మరోసారి టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సీటు నుంచి తానే స్వయంగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోసారి జగిత్యాల సీటును గులాబీ ఖాతాలో వేసేందుకు కంకణం కట్టుకున్నారని ప్రచారం ఊపందుకుంది. అయితే.. కవిత జగిత్యాలలోనే ఉండి తన కార్యక్రమాలను నిర్వహిస్తారా..? లేదంటే హైదరాబాద్ నుంచే జగిత్యాల రాజకీయాలను నడిపిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.