ఇదేం ఓవర్ కాన్ఫిడెన్సు? పోల్ స్ట్రాటజీ చెప్పేసిన కేసీఆర్!
కాన్ఫిడెన్సు ఉండాలే కానీ ఓవర్ కాన్ఫిడెన్సు అస్సలు ఉండకూడదు. కానీ.. గులాబీ బాస్ ఈ పాయింట్ ను మిస్ అవుతున్నారు.
కాన్ఫిడెన్సు ఉండాలే కానీ ఓవర్ కాన్ఫిడెన్సు అస్సలు ఉండకూడదు. కానీ.. గులాబీ బాస్ ఈ పాయింట్ ను మిస్ అవుతున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మ తిరిగి పోయే షాకింగ్ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్.. దాని నుంచి ఇంకా బయటకు రానట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన నోటి నుంచి వస్తున్న మాటల్ని చూస్తే.. ఇంత తెలివితక్కువగా కేసీఆర్ మాట్లాడుతున్నారేంటి? అన్న సందేహాం కలగటం ఖాయం. సాధారణంగా ఎన్నికల వేళ.. తాము అనుసరించే వ్యూహాల్ని పెద్దగా చెప్పుకోరు. ఒకవేళ చెప్పినా.. తమ అసలు వ్యూహాన్ని దాచేసి.. కొసరు అంశాల్ని మాత్రమే ప్రస్తావిస్తుంటారు.
కేసీఆర్ మాత్రం తమ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు.. ప్రజలకు సైతం ఇట్టే అర్థమయ్యేలా తమ ప్లానింగ్ గురించి ఓపెన్ కావటం గమనార్హం. ఎంపీ ఎన్నికలు మొత్తం రైతుల చుట్టూ తిరిగేలా చేసిన ప్లానింగ్ గురించి చెప్పేశారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచార వేళ ఒక్కో లోక్ సభ స్థానం పరిధిలో తాము నిర్వహించే సభలు.. సమావేశాల లెక్కను చెప్పేశారు. ఎంపీ పరిధిలోని రెండు.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు.. సాయంత్రం వేళలో వీటిని నిర్వహిస్తామని.. ఉదయం పూట మాత్రం రైతుల వద్దకు వెళ్లనున్నట్లుగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ లోని ప్రతీ నాయకుడు ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై స్పందించాలన్న ఆయన.. అందుకు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో లక్ష కార్డులు పోస్టు కావాలన్న ఆయన.. రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.500 బోనస్ పై ప్రశ్నించాలన్నారు. అంతేకాదు.. రైతులకు రేవంత్ ఇచ్చిన హామీల్ని గుర్తు చేయాలని కోరుతున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. ప్రభుత్వం కొలువు తీరి.. కేసీఆర్ అండ్ కో పెడుతున్న పంచాయితీల నుంచి బయటకు వచ్చేందుకు కిందా మీదా పడటానికే సమయం సరిపోతున్న వేళ.. పాలన మీద ఫోకస్ చేయనివ్వకుండా వ్యవహరిస్తున్న వైనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ విషయాన్ని వదిలేసి.. ఇప్పుడిలా తమ వ్యూహాల్ని బయటకు చెబుతున్న వైనంతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న వాదన వినిపిస్తోంది. అందులో ఎంత నిజం ఉందన్నది ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాయని చెప్పక తప్పదు.