‘మిత్రమా వీడ్కోలు’ అంటూ కేసీఆర్ గతాన్ని ఇంతలా ఎవరూ బయటపెట్టలేదేమో?
సోషల్ మీడియాకు ఉన్న పరిధి ఎంత? అన్న విషయాన్ని చెప్పాల్సి వస్తే.. ఒక్క మాటలో చెప్పటం సాధ్యం కాదని మాత్రం చెప్పొచ్చు.
సోషల్ మీడియాకు ఉన్న పరిధి ఎంత? అన్న విషయాన్ని చెప్పాల్సి వస్తే.. ఒక్క మాటలో చెప్పటం సాధ్యం కాదని మాత్రం చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో అర్థం పర్థం లేని అంశాలు.. అసత్యాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుంటాయి. కానీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం నిప్పులాంటి నిజాలు.. ఏ మీడియాలోనూ రాని కఠిన వాస్తవాలు బయటకు వచ్చేలా చేసే శక్తి సోషల్ మీడియాకు మాత్రమే ఉందని చెప్పాలి.
తెలంగాణ సమాజానికి అంతో ఇంతో పరిచయం ఉన్న మీడియా, సినీ ప్రముఖుల్లో ప్రేమ్ రాజ్ ఇనుముల ఒకరు. గులాబీ అధినేత కేసీఆర్ సొంత టీవీ చానల్ అయిన టీ న్యూస్ లో కీలకంగా వ్యవహరించటమే కాదు.. ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ముఖ్యుల్లో ఆయన ఒకరు. అలాంటి ఆయన.. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఇంతకాలం తన కడుపులో దాచుకొని.. కొందరి సన్నిహితుల వద్ద షేర్ చేసుకున్న విషయాల్ని తాజాగా సోషల్ మీడియా వేదిక మీద ప్రపంచానికి తెలిసేలా చేయటం.. ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు సంచనలంగా మారింది.
గతాన్ని.. తెలంగాణ ఉద్యమ చరిత్రను..అందులో కేసీఆర్ పాత్రను.. కేసీఆర్ తో కలిసి తాను చేసిన పనులను బయటపెట్టటమేకాదు.. సందర్భానికి తగ్గట్లే గతాన్ని కాస్తంత లోతుగా తవ్వి తీసి.. తన గురుతుల్ని పోస్టుగా మలిచిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిత్రమా వీడ్కోలు పేరుతో సుదీర్ఘంగా పెట్టిన పోస్టు చివర్లో.. సశేషంగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో కఠిన వాస్తవాలు బయటపెట్టనున్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టులో ఏముందన్నది.. యథాతధంగా చూస్తే..
మిత్రమా వీడ్కోలు.....
తొమ్మిదేళ్ల తెలంగాణకు అహంకారం, అవినీతి అనే గ్రహణం వీడుతున్నవేళ నాకు కొన్ని గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.
మిత్రమా కేటీఆర్....
2001 వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి రాక డిప్యూటీ స్పీకర్ గా అసంతృప్తితో ఉన్న మీ నాన్న కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి మీకు తెలుసు. అవును...ఇకనుంచి తెలంగాణ సమాజం మిమ్మల్ని అలాగే గుర్తు పెట్టుకుంటుంది. ఇప్పుడిక కెసిఆర్ తెలంగాణ జాతిపిత ఎంతమాత్రం కాదు.దానికి నిజమైన అర్హుడు జయశంకర్ సారే. ఆయన్నుంచి ఇక మీరు ఆ గౌరవాన్ని ఎంతమాత్రం గుంజుకోలేరు..ఇప్పటినుంచి ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేది తెలంగాణ ఉద్యమాన్ని స్వలాభం కోసం వాడుకుని, మిగులు రాష్ట్రమైన తెలంగాణను మీ అవినీతితో లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన అవినీతిపరులుగానే...
2001 నుండి ప్రజలు స్వచ్చందంగా ఉద్యమంలోకి వస్తున్న తరుణంలో దాన్ని ఆసరాగా చేసుకుని మీరు అప్పుడే వసూళ్ల దందాకు తెరలేపిన సంగతి మీ ఉద్యమ సహచరులను ఎవరిని అడిగినా చెప్తారు. 2001 నుండి 2008 వరకు ఎనిమిదేళ్లలో ఉద్యమం పేరుతో మీరు కోట్లాది రూపాయలు, భూములు పోగేసుకోవటంతో పౌర సమాజం, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నుండి విమర్శలు మొదలైన సంగతి మీకు తెలుసు.అదే ఆసరాగా తీసుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారు మీ పార్టీని చీల్చి మిమ్మల్ని నిర్వీర్యం చేయటం అందరికీ తెలిసిందే.ఇక అప్పుడు కెసిఆర్ గారు కూడా కాడి ఎత్తేసి నేను ఉద్యమం నడపలేను అన్న అశక్తత వ్యక్తం చేసారు. మీపై వస్తున్న విమర్శలకు మీరు కూడా ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియని నిస్సహాయ పరిస్థితి.
అప్పుడు నేను మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర రైటర్ గా పనిచేస్తూ ఉద్యమంలో పాల్గొంటున్నాను.ఆ పరిస్థితుల్లో మీతో నాకు పరిచయం లేకపోయినా ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ పార్టీని బతికించుకోవటం అవసరం అని అనిపించింది. ఆ పరిస్థితుల్లో కూడా మీరు నిరాశ పడకుండా ముందుకు పోయే అవకాశం ఉందని చెప్తూ, మీపై వస్తున్న విమర్శలకు మీరు చెప్పలేని సమాధానాలతో ఒక చిన్న బుక్ లెట్ (కేసీఆర్ వ్యూహం..వైఫల్యం-జూన్ 2008 )
రాసి విడుదల చేసాను.ఒక మీటింగ్ దగ్గర పెడితే అనూహ్యంగా నాలుగువేల కాపీలు రెండురోజుల్లో అమ్ముడు పోయాయి. మూడోరోజే మళ్ళీ ద్వితీయ ముద్రణకు ఆర్డర్ ఇచ్చాను. అలా ఆ బుక్ నాలుగోరోజుకు మీ దగ్గరికి చేరింది. అది చదివిన మీరు అందులో ఉన్న నా నెంబర్ చూసి నాకు ఫోన్ చేసారు `అన్నా మనం ఒకసారి కలుద్దాం' అని.
అప్పుడు నేను బంజారా హిల్స్ లో మీ పార్టీ ఆఫీస్ కు దగ్గరే ఉండేవాణ్ని. నేను మీ పార్టీ ఆఫీస్ కు వచ్చేసరికి మీరు నాకోసం చూస్తూ నిలబడ్డ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. నేను రాగానే సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టి గంటసేపు నా బుక్ లోని ప్రతీ అక్షరం నాకు ఒప్పజెప్పారు. దాన్నిబట్టి మీరు ఆ బుక్ ని ఎన్నిసార్లు చదివారో నాకు అర్ధమైంది.
`నిన్న మహబూబ్ నగర్ నుండి వస్తూ మా డాడీ నేను హైదరాబాద్ వచ్చేవరకు మీ బుక్ గురించే మాట్లాడుకున్నాం' అని చెప్పారు. తర్వాత కెసిఆర్ గారికి పరిచయం చేసారు. ఆయన కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఏంచేస్తున్నావని వివరాలు అడిగారు. `నీలాంటివాడు ఉద్యమానికి అవసరం, మాతో కలిసి పనిచేస్తావా' అన్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టకముందే వరంగల్ లో జయశంకర్ సార్ తో కలిసి తిరిగినవాణ్ని గనుక సరేనన్నాను. ఇక అప్పటినుండి మీతో నా ప్రయాణం మొదలైంది.
అప్పుడు పార్టీ క్యాడర్ లో స్థైర్యం నింపటానికి పార్టీ తరపున కొన్నివేల కాపీలు ప్రింట్ చేసి అన్ని ఊళ్లకు పంపించారు. అది ఆ సమయంలో మీకు ఎంతో అక్కరకు వచ్చింది.అప్పుడు మీ పార్టీలో ఉన్న రఘునందన్ రావు గారు, శ్రావణ్ గారు, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా కొందరు నాయకులు నా అనుమతితో ఆ బుక్ ని కొన్ని వేల కాపీలు ప్రింట్ చేసి తమ తమ నియోజకవర్గాల్లో పంచుకున్నారు.ఆరోజుల్లో వందలు వేల పేజీలున్న పుస్తకాలు చేయలేని పని 16 పేజీలున్న ఆ చిన్న బుక్ లెట్ చేసింది.
అప్పటినుండి నా ప్రొఫెషన్ ని కూడా పక్కన పెట్టి మీతోపాటు ఉద్యమంలో తిరిగాను. లాటీ దెబ్బలు తిన్నాను, అరెస్ట్ అయ్యాను.తెలంగాణే లక్ష్యంగా కీలకమైన సందర్భాల్లో మీ పక్కన ఉన్నాను.ఐదు లక్షల మందితో నిర్వహించిన సిద్దిపేట ఉద్యోగ గర్జనకు కన్వీనర్ గా వ్యవహరించి సభ సక్సెస్ కావటంలో నావంతు పాత్ర పోషించాను.ఉద్యమాన్ని ముందుకు ఉరికించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు మీ నాన్నకు, పార్లమెంట్ లో కూడా ప్రతిధ్వనించిన `జాగో భాగో' నినాదాన్ని అందించాను.ఉద్యమానికి ఊపునివ్వాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు `జైకొట్టు తెలంగాణ' పాటనిచ్చాను.
2009 లో తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలో వివరిస్తూ సవివరమైన డాక్యుమెంట్ ని మీ నాన్నకు ఇచ్చాను. 2014 లో మీ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో సినిమా రంగం అభివృద్ధి కోసం మీరు, తుమ్మల నాగేశ్వర్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ఒక త్రిసభ్య కమిటీ వేసారు. సెక్రటేరియట్ లో ఆ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు నేను తెలంగాణ సినిమారంగం అభివృద్ధి కోసం మీ ప్రభుత్వ విధానం ఏమిటని అడిగాను. తర్వాత మీరు మాట్లాడుతూ `ప్రేమ్ రాజ్ చెప్పినట్టు తెలుగు సినిమా రంగం ఉంటుంది, తెలంగాణ సినిమా రంగం ఉంటుంది. దానికోసం మేం చర్యలు తీసుకుంటాం.' అని చెప్పారు.
తర్వాత సెక్రటేరియట్ లో కలిసి పూర్తి వివరాలతో మీకొక మెమోరాండం ఇచ్చాను.దాన్ని మీరు చాలా నిర్లక్ష్య ధోరణితో తీసుకుని కారెక్కి వెళ్లిపోయారు.అలా తెలంగాణ సినిమాను గాలికొదిలేసాక మీ సంబంధాలు ఎవరితో కొనసాగాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మీరు మంచి వక్త , ఒప్పుకుంటాను.కానీ మీ స్పీచ్ లలో సందర్భానుగుణంగా సామెతలు, కథలు యాడ్ చేస్తే బాగుంటుందని నేను చెప్పిన తర్వాతే అవి జతయ్యాయని అంతకుముందు స్పీచ్ లు గమనిస్తే తెలుస్తుంది. మీతోపాటు నేను ఒక మీటింగ్ కు కరీంనగర్ కు వెళ్లి అర్ధరాత్రి ఇద్దరమే కారులో తిరిగి వస్తున్నప్పుడు చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది.
బోడుప్పల్ అవతల చెంగిచర్లలో నారాయణ కాలేజ్ పిట్టగోడ కూలి ఒక విద్యార్థి చనిపోయి, 30 మంది విద్యార్థులు గాయాలపాలు కావటంతో మీతోపాటు నేనుకూడా వచ్చి హైవేపై ధర్నాలో కూర్చున్నాను. తిరిగొస్తుంటే ఉప్పల్ దాకా రాగానే ఆ కాలేజ్ యజమాని నుండి మీకు ఫోన్ కాల్ వచ్చింది.అప్పటికి అతని రాజీ ప్రతిపాదనకు మీరు ఒప్పుకోనట్టే చేసారు.కానీ తర్వాత ఆ విషయం పట్టించుకోవటం మానేసారు.ఏం జరిగిందో మీకే తెలియాలి.
నేను మీ టీన్యూస్ లో ప్రోగ్రామింగ్ హెడ్ గా పని చేస్తున్నప్పుడు, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో రాంకీ కంపెనీ వదిలే వ్యర్ధాలతో భూగర్భ జలాలు కలుషితమై, అక్కడి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, గర్భినుల కడుపులోని పిండాలు కూడా ఆ ప్రభావానికి గురవుతున్నాయని మీనాన్న మమ్మల్ని మోటివేట్ చేసాడు.దాంతో రిపోర్టర్లు ప్రాణాలకు తెగించి సీక్రెట్ కెమెరాలతో వెళ్లి, వాళ్ళు వెంటపడి తరుముతుంటే కూడా రికార్డు చేసుకొని వచ్చారు. వెంటనే అది బ్రేకింగ్ న్యూస్ గా టీన్యూస్ లో ప్రసారం అయింది. కానీ ఏమైందో ఏమో సాయంత్రానికి గప్ చుప్...అంత ఘనులు మీరు..
మీకు మనుష్యుల పట్ల కనీస సానుభూతి ఉండదని దాంతో అర్ధం అయింది. సంపాదన కోసం మీరు ఏమైనా చేస్తారని తెలిసింది.తర్వాత మీకు అధికారం రాగానే అదే రాంకీ కంపెనీకి పనులిచ్చారు. తర్వాత నేను కొద్దికాలానికే మీ ఛానెల్ నుండి బయటికొచ్చాను. ఒకసారి నర్సంపేట దగ్గర గిరిజన తండాలో విష జ్వరాలు వచ్చి చనిపోతున్నారు అని, పరామర్శించి వద్దామంటే మీతోపాటు నేను కూడా బయలుదేరాను.జనగాం దాకా వెళ్ళగానే ఢిల్లీ నుండి కెసిఆర్ గారు నాకు ఫోన్ చేసి అర్జంట్ గా ఢిల్లీ రావాలని చెప్పారు. మీతో కూడా మాట్లాడి నన్ను ఢిల్లీకి పంపమన్నారు.
మీరు వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారికి ఫోన్ చేసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి కారు అరేంజ్ చేయమని చెప్పారు. ఆరోజు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళగానే జయశంకర్ సార్ కలిసారు. ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం. తర్వాత రోజు అక్కడ నేషనల్ మీడియా ప్రెస్ మీట్ ఉంది. ఆరోజు మాట్లాడే విషయాలు డిస్కస్ చేయటానికే అంత అర్జెంట్ గా రమ్మన్నారు. ఆరాత్రి డిస్కస్ చేసిన విషయాలతో స్పీచ్ రాసి మరుసటి ఉదయం కెసిఆర్ గారి ముందు పెట్టాను.సేమ్ నేను మాట్లాడినట్టే రాసావు అన్నారు. `సినిమా రైటర్ ని కదా సార్ నాకు మీ డిక్షన్ తెలుసు' అన్నాను.ఆరోజు ఢిల్లీలో మీడియా ముందు జయశంకర్ సార్ తో కలిసి నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారు.అలా అవసరం ఐన సందర్భాల్లో నావంతు కర్తవ్యం నేను నిర్వహించాను.
మీ నాన్న కెసిఆర్ గారు నిరాహార దీక్షకు కూర్చుంటానన్నప్పుడు నా అభిప్రాయం అడిగితే వద్దని చెప్పాను. అది చివరి అస్త్రంగా వాడుదామని చెప్పాను.(అప్పుడు అది నాటకమని నాకు తెలీదు) ఖమ్మంలో నిమ్మరసం తాగి నిరాహార దీక్ష ముగించటం, ఉస్మానియా విద్యార్థుల శవయాత్రతో తిరిగి కంటిన్యూ చేయటం తెలిసిందే.అప్పుడు రాష్ట్రం అట్టుడుకుతోంది. నిమ్స్ దగ్గర ఉద్రిక్తంగా ఉంది. ఒకరోజు కెసిఆర్ గారిని చూడటానికి నేను ప్రముఖ దర్శకులు బి. నర్సింగరావు గారితో కలిసి నిమ్స్ కి వచ్చాను.అప్పుడు ఈటెల రాజేందర్ గారు,హరీష్ రావు గారు,నాయిని నర్సింహారెడ్డి గారు, మరికొందరు కెసిఆర్ గారి బెడ్ చుట్టూ చేరి బయటికి రిలీజ్ చేయాల్సిన ప్రెస్ నోట్ గురించి మాట్లాడుతున్నారు.
అప్పుడు నేను ఆ గదిలోకొచ్చి కెసిఆర్ గారికి నమస్కారం పెట్టాను.(నోట్:నమస్కారమే పెట్టాను.అన్నేళ్ల పరిచయంలో నేను మీ నాయిన కాళ్ళెప్పుడూ మొక్కలేదు) అప్పుడు నన్ను చూసిన మీ నాన్న అంత నీరసంలో కూడా `ప్రేమ్ రాజ్ బాగా రాస్తాడు. అతనితో రాయించండి' అని మెల్లిగా చెప్పాడు. దాంతో అందరూ బయటికొచ్చారు. నేను ఈటెల రాజేందర్, హరీష్ రావు గారితో డిస్కస్ చేసి ప్రెస్ నోట్ రాసాను. దాన్నే మీడియాకు రిలీజ్ చేసారు.
సాయంత్రం అందరూ వెళ్తుంటే మీరు నన్ను ఉండమన్నారు. రాత్రి 11 అవుతోంది. అక్కడ ఇద్దరమే ఉన్నాం. చెకింగ్ కు మీ పర్సనల్ డాక్టర్ వచ్చాడు. ఆయన కెసిఆర్ గారిని చూసాక అతన్ని మీరు డిన్నర్ చేసారా అని అడిగారు. అతను చేయలేదనటంతో రాత్రి 11.30 కి ముగ్గురం కలిసి హోటల్స్ కోసం పంజాగుట్ట,అమీర్ పేట్ అంతా తిరిగాం. చివరికి అప్పుడే క్లోజ్ చేస్తున్న ఒక హోటల్ కు వెళ్లి డిన్నర్ చేసాం.తిరిగి హాస్పిటల్ కు వచ్చాక కెసిఆర్ గారికి ఏమైనా అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో `తెలంగాణ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. మనిషి పోతే రాడు కదా. దీక్ష విరమిస్తే బాగుంటుంది' అన్నాను.
అప్పుడు మీరు `అప్పటికే ఖమ్మంలో జరిగిన దానికి ఏమైందో తెలుసు కదా అన్నా ' అంటే..అదే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో దీక్ష విరమించమనే ప్రతిపాదన వస్తే ఓకేనా అని చెప్పాను. దానికి మీరు సరేననటంతో మరుసటి రోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో చారిత్రాత్మకమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఆరోజు ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలనాయకులతో పాటు, ఎన్నడూ ఏ పార్టీ ఆఫీసు మెట్లెక్కని సినీ దర్శకుడు బి.నర్సింగ రావు గారి లాంటివాళ్ళు కూడా కేవలం నా చొరవతో అక్కడికి వచ్చారు. రావటమే కాదు, అందరి తరఫున మీడియా ముందు అడ్రెస్ చేయమని కూడా ఆయన్ని నేనే బలవంతపెట్టి ఒప్పించాను. అది ఆయన ఇప్పటికీ చెప్తుంటారు.
అదృష్టవశాత్తు ఆరోజు సాయంత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018 లో మీ పాలన తీరు మారాలని వ్యక్తిగతంగా(చాటింగ్ లో)మీకు చెప్పాను. మీరు అడిగితే వివరంగా నోట్ రాసిస్తా అని కూడా చెప్పాను. నాలుగు పేజీలు రాసి ఆ విషయం మాట్లాడటానికి టైమ్ ఇస్తే చెప్పాలనుకున్నాను.కానీ వేరే విషయాలకు టైమ్ ఇచ్చారు తప్ప దానికి టైమ్ ఇవ్వలేదు. అది ఇప్పుడు ముందు పెట్టుకుని చూస్తే ఐదేళ్లకిందే మీ ఓటమికి కారణాలు కనపడతాయి. సరిగ్గా నేను చెప్పిన తప్పులే ఇవ్వాల్టి మీ ఓటమికి పునాది.. అవి దిద్దుకుంటే తెలంగాణ సమాజం మీకు కనీసం ఇంకో టర్మ్ అవకాశం ఇచ్చేది. కానీ మీకు దిద్దుకునే ఉద్దేశ్యం లేకపోవటం వల్లే ఈ ఫలితం..
చివరికి ఉద్యమంలో ఇంతమంది ఇన్ని త్యాగాలు చేసి శ్రమపడి తెలంగాణ తెస్తే మా నాయిన చావునోట్లో తలపెట్టి తెచ్చాడు, రోట్లో తలపెట్టి తెచ్చాడు అని అందరి త్యాగాలను ఒక్కరి అకౌంట్ లో వేసిన ఫలితమే ఇది. మీ నాయిన చేసిన నిరాహార దీక్ష ఎంత సొక్కమో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు దాని గురించి పదే పదే చెప్తారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఉద్యమకారులుగా మొదలై దోపిడిదారులుగా మిగిలిపోవటం ఎంత విషాదం. కాబట్టి మిత్రులారా...ఈ రాష్ట్రం ఏ ఒక్కరి త్యాగ ఫలితం కాదు.ఇన్నాళ్ళూ వీళ్ళ చుట్టూ ఉండే భజనపరులు, బానిసలు ఈ త్యాగాలను సర్వం సహా కల్వకుంట్ల కుటుంబానికే అంటగట్టే ప్రయత్నం చేసారు. ఇప్పుడు తెలంగాణకు ఆ పీడ వదిలిపోయింది. నిజమైన చరిత్రను, ఉద్యమంలో మీ పాత్రను ప్రజల ముందు పెట్టండి. ముందు తరాలకు నిజమైన చరిత్రను అందించండి. (ఇది సశేషమే...)