పదేళ్ల పాలన తర్వాత కూడా.. చాణక్య నీతిని నిజం చేస్తున్న కేసీఆర్!
వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. నుంచి నేటి వరకు బీఆర్ ఎస్ అధికారంలో ఉంది.
పదేళ్ల పాలన పూర్తయింది. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెబుతున్నారు. దేశంలోనే ఎక్కడా అమలు కాని దళిత బంధు వంటి కీలక పథకాలను కూడా తీసుకువచ్చామని అంటున్నారు. ఇక, రుణ మాఫీ, రైతు బంధు, విద్యుత్.. వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇంత చేస్తున్నా.. ఎక్కడో సంశయం.. అనుమానం.. సందేహం! గెలుపు గుర్రంపై ఎక్కడో అనుమానాలు. దీంతో మళ్లీ ఏపీని ఆలంబనగా చేసుకుని అరుపులు.. పెడబొబ్బలు.. సెంటిమెంటు పేలుళ్లు!!
ఇదీ.. ఇతమిత్థంగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో చేస్తున్న ప్రచా రం. అవకాశం దక్కితే చాలు.. ఏపీపై పడుతున్న పరిస్థితి బీఆర్ ఎస్ అధినాయకుడి నుంచి ఇతర నాయ కుల వరకు కూడా కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ.. ఎక్కడా ఏపీ ప్రస్తావన తీసుకురావడం లేదు. తెలంగాణలో అక్రమాలు జరుగుతున్నాయని, అన్యాయాలు జరుగుతున్నాయని చెబుతున్న ఈ పార్టీల నేతలు.. ఏపీని ఎక్కడా ఉదహరించడం లేదు.
కానీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. సెంటిమెంటును పట్టుకుని వేలాడే కేసీఆర్.. ఆయన పరివారం.. పదేళ్ల సువర్ణ పాలన అందించామని ఘంటా పథంగా చెబుతూనే.. మరోవైపు ఏపీని అడ్డుపెట్టుకుని.. ఆటలో నెగ్గాలనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం.. సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. ``తన బలం తక్కువగా ఉందని అంచనా వేసిన వారే.. పొరుగు వారిలోపాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తా`` రన్న చాణక్య నీతి ఇప్పుడు స్పష్టంగా బీఆర్ ఎస్‌లో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. నుంచి నేటి వరకు బీఆర్ ఎస్ అధికారంలో ఉంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల మయం చేశారనే అపవాదును కూడా సొంతంచేసుకుంది. అయినప్పటికీ.. ఏపీని బూచిగా చూపించి.. ఏదో చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్.. తలసరి ఆదాయంలో అంతో ఇంతో మంచిగా ఉన్న ఏపీ(కేంద్రం లెక్కల ప్రకారం)ని ఉదహరించడం లేదు.
ఈ విషయంలో ఇతర బీహార్, యూపీ వంటి రాష్ట్రాలను ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే.. తనకు అనుకూలంగా ఉంటే ఒకవిధంగా.. ప్రతికూలంగా ఉంటే మరో విధంగా ఆయన ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా పదేళ్ల పాలన తర్వాత కూడా.. ఇంకా ఏపీని పట్టుకుని వేలాడుతూ.. ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.