గజ్వేల్ ఫైట్ : కేసీయార్ మీద అసంతృప్తి ఈటెలకు ప్లస్...?

తెలంగాణాలో ఇపుడు అసలైన ఇంటరెస్టింగ్ పోరుకు తెర లేచింది.

Update: 2023-10-22 16:00 GMT

తెలంగాణాలో ఇపుడు అసలైన ఇంటరెస్టింగ్ పోరుకు తెర లేచింది. ముఖ్యమంత్రి కేసీయార్ రెండు సార్లు గెలిచి నా సొంత గడ్డ అని గట్టిగా గర్వంగా చెప్పుకునే గజ్వేల్ అసెంబ్లీ సీటులో బీజేపీ నేత ఈటెల రాజేందర్ అడుగు పెడుతున్నారు. నిజానికి కేసీయార్ కి వెన్ను దన్నుగా ఉద్యమంలో సై దోడుగా ఉంటూ రెండు దశాబ్దాల పాటు ఈటెల గులాబీ దండులో తాను ఒక్కడిగా ఉన్నారు.

అయితే ఆయన తాను కారు పార్టీకి ఒక ఓనర్ నే అని చెప్పడంతో కధ అడ్డం తిరిగింది. కారు పార్టీకి అసలైన ఓనర్ కేసీయార్ తప్ప మరొకరు కాదు, ఆ సంగతి లోకం మొత్తానికి తెలుసు. ఆయన తరువాత కుమారుడు కేటీయార్ ఆ ఓనర్ షిప్ కోసం కాచుకుని కూర్చున్నారు.

అలాంటి నేపధ్యంలో ఈటెల తాను నేతను కాదు ఓనర్ ని అంటే ఊరుకుంటారా. అందుకే బీయారెస్ నుంచి ఆయనను బయటకు పంపేశారు. నిజం చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలలో ఎవరెంత సేవ చేసినా సర్వస్వం అధినేతలే అవుతారు. అలా కుటుంబ పెత్తనమే ప్రాంతీయ పార్టీలలో ఉంటుంది.

ఈటెలకు ఈ సంగతి తెలిసినా కేసీయార్ తో ఢీ కొట్టారు. బయటకు వచ్చారు ఇక ఈటెల ఇగో బాగా దెబ్బ తింది. అందులో కొంత వరకూ ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తీర్చుకున్నారు. కేసీయార్ నిలబెట్టిన అభ్యర్ధిని ఓడించడం ద్వారా బీయారెస్ మీద పై చేయి సాధించారు.

ఇపుడు అసలైన అగ్ని పరీక్షను ఆయన ఎదుర్కోబోతున్నారు. కేసీయార్ వంటి బిగ్ షాట్ ని ముఖ్యమంత్రి గా ఉన్న వారిని మరోసారి సీఎం కాబోతున్న కేసీయార్ ని ఓడించడం అన్నది ఈటెల టార్గెట్. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. గజ్వేల్ లో కేసీయార్ పాతుకుపోయారు. ఆయనకు 2018 ఎన్నికల్లో 58 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీ దక్కింది.

ఈసారి కూడా అంత మెజారిటీ సాధించాలని కేసీయార్ టీం చూస్తోంది. అయితే కేసీయార్ కి అనుకూలతగా అధికార పార్టీ దన్ను, అర్ధబలం, అంగబలం వంటివి ఉన్నా అదే తీరులో మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కేసీయార్ గజ్వేల్ లో పర్యటించలేదు. దాంతో జనాలలో అసంతృప్తి ఒక లెవెల్ లో ఉంది. ఈసారి కేసీయార్ గెలిచినా మెజారిటీ గతంలో రాదు అన్న చర్చ ఉంది.

దాంతోనే ఆయన సేఫ్ సైడ్ అన్నట్లుగా కామారెడ్డిలో రెండవ సీటుని కూడా ఎంచుకుని మరీ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సామాజిక పరిస్థితులు కూడా గజ్వేల్ లో కేసీయార్ కి కలసిరావని అంటున్నారు. గజ్వేల్ లో ముదిరాజ్ సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉంది

బీయారెస్ ముదిరాజ్ సామాజికవర్గానికి సీట్లు ఇవ్వలేదు అన్న అసంతృప్తి వారిలో బాగా ఉంది. దాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో సఫలీకృతుడైన ఈటెల ఇపుడు ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న గజ్వేల్ నుంచి పోటీ చేయడం ద్వారా కేసీయార్ కి గట్టి దెబ్బ తీయాలని చూస్తున్నారు.

గజ్వేల్ లో మొత్తం ఓట్లు రెండు లక్షల దాకా ఉంటే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు ఏకంగా డెబ్బై వేల పై చిలుకు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈటెల కేసీయార్ ని ఓడిస్తాను అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఇక బీసీ అయిన ఈటెల ఆ సామాజికవర్గం ఓట్ల మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. దళితుల ఓట్లు కూడా గజ్వేల్ లో ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాను గత అయిదేళ్లలో ఎమ్మెల్యేగా పెద్దగా పర్యటించలేదని కేసీయార్ చెప్పారు. ఈసారి అలాంటి పొరపాటు జరగనీయనని కూడా ఒట్టేశారు. తనను గెలిపించాలని మెజారిటీ కూడా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపధ్యంలో బీయారెస్ మీద ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునే మొనగాడిగా ఈటెల బరిలోకి దిగుతున్నారు అని అంటున్నారు.

ఈటెల గెలుపు అన్నది ఇపుడే చెప్పకపోయినా కేసీయార్ ని ముప్పతిప్పలు పెట్టడంలో మాత్రం ఆయన ఫుల్ గానే సక్సెస్ అవుతరరని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈటెల పోటీ అంటే బీయారెస్ బే ఫికర్ గా ఉండడానికి కుదరదు అనే అంటున్నారు. చూడాలి మరి గజ్వేల్ పోరు ఎలా ఉంటుందో. ఏ రకంగా రక్తి కట్టిస్తుందో.

Tags:    

Similar News