ఎన్నికల టైంలో ఈ వార్నింగులేంది కేసీఆర్?

ఎన్నికల వేళ ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు

Update: 2023-11-18 04:05 GMT

ఎన్నికల వేళ ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇలాంటి విషయాలు అందరి కంటే ఆయనకే ఎక్కువ తెలుసు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడిన సామెత చందంగా అన్ని తెలిసిన కేసీఆర్.. ఇప్పుడిలా మాట్లాడటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల వేళ.. పెద్ద ఎత్తున ప్రచార సభలకు హాజరవుతున్న కేసీఆర్.. తాజాగా హుజూరాబాద్ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల వేళ.. ఓట్లు అడిగితే బాగుంటుంది. అందుకు కాస్తంత ఒద్దికగా మాట్లాడితే మరింత మంచిగా ఉంటుంది. కానీ.. తనను తీవ్ర నిరాశకు గురి చేసిన హుజూరాబాద్ ప్రజలను ఆకట్టుకునే కంటే కూడా.. గతంలో ఒకసారి అలా చేశారు. ఈసారి మాత్రం అలా చేయొద్దంటూ ఓపెన్ గా చెప్పేసిన వైనం ఆశ్చర్యాన్ని కలిగించేలామారింది.

నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. ''రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలి. మంచి పార్టీకి ఓటు వేస్తే అంతా మంచే జరుగుతుంది'' లాంటి మాటలు ఓకే. అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు షాకింగ్ కు గురి చేశాయి. ''గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారు. ఈసారి అలా జరగొద్దు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా? నా కొడుకు లాంటి కౌశిక్ రెడ్డికి ఓటేయండి. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటా'' అని వ్యాఖ్యానించిన తీరు మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. ఆ మధ్యన ఈటెల రాజేందర్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నిక ఫలితాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. కీలకమైన ఎన్నికల వేళ.. ఓట్లు అడిగే పద్దతి ఇదేనా? ఓట్లు అడిగేందుకు ఇదేం టోన్? అన్నది ప్రశ్నగా మారింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని.. ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వలేదన్న కేసీఆర్.. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో చెబుతున్నా.. కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించిన కేసీఆర్.. ''ఒక్కక మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి?'' అంటూ ప్రశ్నించారు.

బీజేపీపై విరుచుకుపడిన కేసీఆర్.. ఆ తర్వాతి వంతుగా కాంగ్రెస్ పై మాటల గురి పెట్టారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధరణి బంగాళాఖాతంలో వేసి భూమాత పెడతామని రాహుల్ గాంధీ.. భట్టి విక్రమార్క.. రేవంత్ రెడ్డి అంటున్నారని.. ధరణి పోతే మీకు రైతుబంధు ఎలా వస్తుంది? అంటూ ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే ఏమొస్తది.. ఇక్కడ గెలిచి ఎన్నాళ్లయింది? ఒక్క పైసా పని చేసిందా? అంటూ ప్రశ్నించిన కేసీఆర్ మాటల ప్రభావం ఎంతన్నది మాత్రం డిసెంబరును మూడన తెలుస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News