సారూ.. కారూ.. అయ్యో కేసీఆరూ!

జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు ‘ఫెడరల్‌ ఫ్రంట్‌‘ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరిగొచ్చారు

Update: 2024-03-16 06:16 GMT

తెలంగాణ జాతిపితగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల పొగడ్తలు, తెలంగాణ అంటే ‘సారు, కారు, కేసీఆర్‌’ అనే అతిశయోక్తులు, తెలంగాణ తెచ్చినవాడిగా గుర్తింపు, దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా అధికార వైభోగం, ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాననే గర్జనలు, ఆడింది ఆట.. పాడింది పాట..

సీన్‌ కట్‌ చేస్తే...

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సంగతి దేవుడెరుగు.. స్వయంగా కేసీఆరే కామారెడ్డిలో ఘోర ఓటమి, వరుసగా పార్టీని వీడుతున్న నేతలు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా లేని అభ్యర్థులు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో గారాల పట్టి కవిత అరెస్టు, కేసీఆర్‌ కంట కన్నీరు.. ఇదీ రాజకీయ దురంధరుడుగా, యోధుడిగా, అపర చాణక్యుడిగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల పొగడ్తలు అందుకున్న సార్‌.. కేసీఆర్‌ దుస్థితి.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి. ఐదేళ్ల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో అఖండ విజయం సాధించి కేసీఆర్‌ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు ‘ఫెడరల్‌ ఫ్రంట్‌‘ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరిగొచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లు, వేలాది కార్లతో భారీ కాన్వాయ్‌ లు, ‘సారూ, కారు, పదహారు, ఢిల్లీ సర్కారూ’ అనే నినాదం

ఇలా కేసీఆర్‌ ఎదురే లేదన్నట్టు సాగిపోయారు. దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీని ఢీకొట్టగలిగే నేత కేసీఆరే అనే రీతిలో విశ్లేషణలు సాగాయి.

ఇందుకు తగ్గట్టే మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కొంతమంది ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్స్‌ ను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు. భారీ ఎత్తున ధన ప్రవాహాన్ని వెదజల్లారు. దేశంలో 150 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఇందుకు తగ్గట్టే దేశ రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు.

అయితే.. 2023 డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్‌ జాతకాన్ని మార్చేశాయి. బీఆర్‌ఎస్‌ ఓటమితోపాటు స్వయంగా కేసీఆరే కామారెడ్డిలో చిత్తయ్యారు. దీంతో బీఆర్‌ఎస్‌ కు కష్టకాలం మొదలైంది.

ఓవైపు తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా అమలు చేస్తూ వారి నుంచి మరింత ఆదరణ పొందుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. నేతలంతా వలస బాటపడుతున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ పార్టీలో, మరికొందరు బీజేపీలో చేరిపోయారు.

ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేయడంతో బీఆర్‌ఎస్‌ పతనం మరింత వేగంగా కొనసాగుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌ అరెస్టు కూడా తప్పదని అంటున్నారు.

కేవలం 100 రోజుల్లోనే బీఆర్‌ఎస్‌ అస్తవ్యస్తంగా మారింది. 120 రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 100 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని, భారీ మెజారిటీతో గెలుపొందుతామని సవాళ్లు విసిరారు. చివరకు 40 సీట్లు కూడా సాధించలేక కూలబడ్డారు.

రానున్న లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే విడుదలయిన పలు సర్వేలు కూడా బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఆశాజనకంగా లేదని తేల్చాయి. 17 ఎంపీ సీట్లలో అత్యధికం కాంగ్రెస్‌ గెల్చుకుంటుందని, మిగిలిన సీట్లను బీజేపీ గెల్చుకుంటుందని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ పార్టీ తెలంగాణ రాజకీయ చిత్రపటంపైన అంతర్థానమయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

Tags:    

Similar News