కేసీఆర్ మెడకు ఉచ్చుగా మారనున్న కేఎంఆర్ వాట్సప్ గ్రూప్?
పోన్ ట్యాపింగ్ అంశంపై సీరియస్ గా ఫోకస్ చేసిన తెలంగాణ పోలీసులు సరికొత్త అంశాల్ని గుర్తిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకంతకూ సీరియస్ గా మారుతోంది. ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొత్త అంశాలు గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్త టెన్షన్ ను తీసుకొచ్చేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో కొత్త అంశం వెలుగు చూసింది. పోన్ ట్యాపింగ్ అంశంపై సీరియస్ గా ఫోకస్ చేసిన తెలంగాణ పోలీసులు సరికొత్త అంశాల్ని గుర్తిస్తున్నారు. గత ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నాటి అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఒక వాట్సప్ గ్రూప్ కేసీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందంటున్నారు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటి కామారెడ్డి. ఆ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రత్యర్థులైన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డిలకు సంబంధించిన అంశాలపై కన్నేసినట్లుగా గుర్తించారు. ఇందుకోసం కామారెడ్డి (కేఎంఆర్) పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయటంతో పాటు.. నాటి స్పెషల్ బ్రాంచ్ కు చెందిన అదనపు ఎస్పీ తిరుపతన్నతో పాటు అతని కింద పని చేసిన పలువురు పోలీసులు సాయంగా నిలిచినట్లుగా గుర్తించారు.
ఈ వాట్సప్ గ్రూప్ సాయంతో రేవంత్ రెడ్డికి.. వెంకటరమణారెడ్డికి ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికను రచించినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఈ ఇద్దరు నేతల ప్రధాన అనుచరుల కదలికలపై కన్నేసి.. ఎప్పటికప్పుడు గ్రూప్ లో చర్చించుకోవటం.. తదుపరి చర్యలు ఏమేం చేయాలన్న దానిపై ప్లానింగ్ జరిగేదన్న విషయాన్ని గుర్తించారు. కామారెడ్డి గ్రూప్ తో పాటు పోల్ 2023 పేరుతో మరో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి.. అక్రమ సొమ్ము జప్తు అయిన వివరాల్ని షేర్ చేసేవారు. ఎవరిపై నిగా ఉంచాలన్న దానిపైనా ప్లానింగ్ చేసే వారని గుర్తించారు.
బీఆర్ఎస్ ప్రత్యర్థుల ప్రొఫైళ్లను సిద్ధం చేయటం.. వారి ఫోన్లను మానిటరింగ్ చేయటం ప్రణీత్ రావు పని కాగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రత్యర్థుల కదలికలపై తిరుపతన్న టీం పర్యవేక్షణ ఉండేదన్న విషయాన్ని తాజా విచారణలో గుర్తించారు. దీంతో.. కాంగ్రెస్.. బీజేపీలకు సంబంధించిన పార్టీ నేతలు ఎవరైనా సొమ్మును తరలిస్తుంటే.. వెంటనే ఆ సమాచారాన్ని షేర్ చేయటం ద్వారా.. టాస్కుఫోర్సుకు సమాచారం అందించి సొమ్మును జఫ్తు చేయించినట్లుగా గుర్తించారు.
ఈ వాట్సప్ గ్రూపులు ఏర్పాటు.. నెట్ వర్కు పర్యవేక్షణ అంశాలు ఎవరి ఆదేశాలతో జరిగాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అన్ని ప్రశ్నలకు టాస్క్ ఫోర్సు మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును ఏ6గా చూపించారు. ఏ2గా ప్రణీత్ రావును చూపించారు. ప్రభాకర్ రావు.. శ్రవణ్ రావులు విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో.. తాజాగా వారిని పరారీలో ఉన్న నిందితులుగా చూపటం గమనార్హం. వారిద్దరిపై నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ వారెంట్ ఇష్యూ చేయాలని కోరుతున్నారు. ఒకవేళ కోర్టు అనుమతి లభిస్తే.. ప్రభాకర్ రావు.. ఒక మీడియా అధినేత శ్రవణ్ రావులపైనా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతున్నారు.