హైదరాబాద్‌లో ఉండొద్దు.. సీఎం, సీనియర్ నేతలకు కాంగ్రెస్ వార్నింగ్!
తాజాగా లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జీలు, అభ్యర్థులతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సారి ప్రధాని మోడీని ఇంటికి పంపించి.. కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. ఇందులో భాగంగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీలైనన్నీ ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాలకు గాను 15 చోట్ల విజయదుందుభి మోగించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నియోజకవర్గాల్లో విజయం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కష్టపడాలని హైకమాండ్ సూచించింది. సీఎం రేవంత్ సహా సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉండాలని కాంగ్రెస్ చెప్పింది.
తాజాగా లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జీలు, అభ్యర్థులతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశనం చేశారు.
అంతే కాకుండా ప్రచారంలో సీఎం రేవంత్ సహా అగ్ర నేతలంతా పాల్గొనాల్సిందేనని వేణుగోపాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎవరూ కనిపించవద్దని, ప్రచారంలో మాత్రమే ఉండాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలోని ముఖ్య నేతలందరూ అన్ని నియోజవకర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలని వేణుగోపాల్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌పై జనాల్లో ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ఉన్న మంచి అవకాశాన్ని వృథా చేసుకోకూడదని చూస్తోంది. అందుకే నేతలందరూ కష్టపడాలని మరీ హెచ్చరిస్తోంది.