కేజ్రీవాల్ గెలిస్తే ఆ రెండు కూటములకూ సవాలేనా ?

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ చావో రేవో అన్నట్లుగా పోరాడుతోంది. ఈసారి గెలిచి వరసగా నాలుగో సారి సీఎం కావాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు.

Update: 2025-02-01 07:30 GMT

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ చావో రేవో అన్నట్లుగా పోరాడుతోంది. ఈసారి గెలిచి వరసగా నాలుగో సారి సీఎం కావాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆయన తనదైన ఎన్నికల వ్యూహాలతో దూకుడు చేస్తున్నారు. ఆప్ కి విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా కేజ్రీవాల్ కాంపెయిన్ సాగుతోంది.

ఇక చూస్తే బీజేపీ ఏ మాత్రం తీసి పోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అన్నింటినీ సిద్ధం చేసుకుని మరీ ఢిల్లీలో యుద్ధం చేస్తోంది. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అంతా కూడా మోహిరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రత్యేక దృష్టి పెట్టారు.

అదే విధంగా మిత్ర పక్షాల నేతలను రంగంలోకి దించుతున్నారు. నిజానికి చూస్తే ఆప్ ఓటమి చెందాలి. కానీ బలంగా గ్రౌండ్ లెవెల్ లో ఇప్పటికీ ఆ పార్టీ ఉందని పోలింగ్ కి దగ్గర పడే కొద్దీ విజయావకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దానికి కారణం ఆప్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అన్నది అందరికీ తెలుసు. అదే బీజేపీ గెలిస్తే సీఎం ఎవరు అవుతారో కూడా తెలియదు.

కాషాయం పార్టీకి ఇది పెద్ద మైనస్ గా మారుతోంది. అంతే కాదు ఢిల్లీలో ఉన్న ఉన్నత వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఇపుడు ఆప్ దిశగా పోలరైజ్ అవుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆప్ తన పాలనలో తప్పులు చేసి ఉండవచ్చు కానీ మెరుగైన పాలన అందించింది అన్నది ఈ వర్గాల భావనగా ఉంది. పైగా ఢిల్లీ ఓటర్లు ప్రతీ సారీ విలక్షణమైన తీర్పుని ఇస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీని గెలిపిస్తున్నారు ఏడు ఎంపీ సీట్లు ఉంటే అన్నీ కమలానికి ఇస్తున్నారు. అదే అసెంబ్లీ ఎన్నికలకు వస్తే మాత్రం ఆప్ కే పట్టం కడుతున్నారు. ఈసారి కూడా వారు ఆ ఆనవాయితీనే కొనసాగిస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్ కి నష్టం అని మొదట్లో వినిపించినా ఓటర్ల వివేచన ముందు కాంగ్రెస్ వీగిపోతోంది అని అంటున్నారు. దాంతో పోటీ ఆప్ బీజేపీల మధ్య ముఖాముఖీగా మారుతోంది అని అంటున్నారు. ఈ పరిస్థితి కూడా ఆప్ కి అతి పెద్ద అడ్వాంటేజ్ గా మారుతోది.

అదే విధంగా ఇండియా కూటమి మిత్రులు అయిన సమాజ్ వాదీ పార్టీ ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటివి ఆప్ కి మద్దతుగా నిలబడడంతో పెద్ద ఎత్తున బడుగు వర్గాలు ఇతర అణగారిన వర్గాల మద్దతు ఆప్ కి దక్కుతోంది. ఇక ఎన్నికలు మరి కొద్ది రోజులకు వచ్చేశాయంనగా వస్తున్న సర్వేలు సైతం ఆప్ కి ఈసారి సీట్లు తగ్గినా అధికారం మాత్రం దక్కుతుందని తేల్చేస్తున్నాయి. కనీసంగా 38 నుంచి 40 దాకా సీట్లు ఆప్ కి వస్తాయని బీజేపీ గతసరి వచ్చిన ఆరేడు సీట్ల నుంచి నాలుగింతలు పెంచుకుంటుంది తప్ప అధికారానికి మాత్రం దూరంగానే ఉంటుందని అంటున్నాయి.

ఇక ఈ సర్వేలు కనుక నిజమై ఆప్ మరోసారి ఢిల్లీ పీఠమెక్కితే రెండు జాతీయ కూటములకు ఒక సవాల్ గా మారుతుందని అంటున్నారు. ఇండియా కూటమిలో అమాంతం కేజ్రీవాల్ ప్రాధాన్యత పెరిగిపోతుందని విశ్లేషిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా ప్రత్యర్థిగా పోటీ పడడంతో మిత్రులు అంతా కలసి ఆ పార్టీని టార్గెట్ చేసి నాయకత్వ స్థానం అందుకున్నా అందుకుంటారు అంటున్నారు.

అదే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయేను సవాల్ చేసేలా కేజ్రీవాల్ మళ్ళీ పూర్తి బలవంతుడిగా మారుతారు అని అంటున్నారు. అది ఇండియా కూటమిని ఇంకా బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి బీజేపీకి ఢిల్లీలో ఓటమి దక్కితే ఆ ప్రభావం బీహార్ ఎన్నికల మీద కూడా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News