మామిడి పండ్లు తింటున్న కేజ్రీవాల్‌... బెయిల్ కోసం అంటున్న ఈడీ!

ఈ సమయంలో ఆయన బెయిల్ కోసం చేస్తున్న పనులు ఇవి అంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సంచలన ఆరోపణ చేసింది

Update: 2024-04-18 11:06 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై రాజకీయంగా బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో ఆయన బెయిల్ కోసం చేస్తున్న పనులు ఇవి అంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సంచలన ఆరోపణ చేసింది.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇందులో భాగంగా... డయాబెటీస్‌ ఉన్నప్పటికీ షుగర్ ఎక్కువగా ఉండే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటి ఆహారపదార్థాలు తీసుకుంటున్నారని తెలిపింది.

వాస్తవానికి తన బాడీలోని షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలంటూ కేజ్రీవాల్‌ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీంతో... ఆ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది. అయితే.. ఈ అభ్యర్ధనను వ్యతిరేకించిన ఈడీ.. ఆయనపై కీలక ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే ఇంటి భోజనం పేరుచెప్పి.. షుగర్ పెరిగే ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది.

ఇదే క్రమంలో... జైల్లో రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ ను ప్రభుత్వ వైద్యులు చెక్‌ చేస్తున్నారని వెల్లడించిన ఈడీ... ఏప్రిల్‌ 1వ తేదీన జైలుకు తరలించిన రోజుతో పోలిస్తే ఇప్పుడు ఆయన చక్కెరస్థాయిలు రెట్టింపు అయినట్లు పేర్కొంది. ఈ క్రమంలో... ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. సీఎంకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని వాదించారు.

దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌ పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహార్ జైలు అధికారులను ఆదేశించింది. అనంతరం పిటీషన్‌ పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా... ఈ నెల 23 వరకూ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News