విజయవాడలో కేశినేని బ్రదర్స్.. ఒంగోలులో ఈ బ్రదర్స్!
మరోవైపు ఒకే కుటుంబంలో నేతల మధ్య విబేధాలు పార్టీకి పెద్ద తలపోటుగా తయారయ్యాయని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తుల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కవనుకున్నవారు టీడీపీ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైపు ఒకే కుటుంబంలో నేతల మధ్య విబేధాలు పార్టీకి పెద్ద తలపోటుగా తయారయ్యాయని అంటున్నారు.
ఇటీవల విజయవాడలో సొంత అన్నదమ్ములు కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని పొలిటికల్ వార్ కొనసాగగా.. ఇప్పుడు ఇదే కోవలో ఒంగోలులో దామచర్ల వార్ మొదలైందని అంటున్నారు. తాజాగా ఒంగోలు నగరంలో అసెంబ్లీ టికెట్ కోసం ఒంగోలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఆయన సోదరుడు దామచర్ల సత్యకు మధ్య గొడవ నడుస్తోందని చెప్పుకుంటున్నారు.
గతంలో ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేశారు.. దామచర్ల జనార్దన్. కమ్మ సామాజికవర్గానికి చెందిన జనార్దన్ ప్రకాశం జిల్లా టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014లో ఒంగోలులో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన జనార్దన్ 2019లో వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు.
వచ్చే ఎన్నికల్లోనూ తనకే సీటు ఖాయమనే ధీమాలో దామచర్ల జనార్దన్ ఉన్నారు. అయితే దామచర్ల జనార్దన్ బాబాయ్ కుమారుడు సత్య కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకే కుటుంబంలా కలసి ఉన్నారు.. జనార్దన్, సత్య. అయితే ఇప్పుడు తన తమ్ముడు తన సీటుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని జనార్దన్ అతడిని దూరం పెట్టడం ప్రారంభించారు.
దీంతో ఒళ్లు మండిన దామచర్ల సత్య తన అన్నకు టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్దన్.. చంద్రబాబు శిబిరంలో ఉండగా సత్య.. లోకేశ్ శిబిరంలో ఉన్నారు. లోకేశ్ ద్వారా దామచర్లకు సీటు రాకుండా సత్య చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఇందుకు ఆయన జనసేన పొత్తును వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న దర్శి, గిద్దలూరు అసెంబ్లీ సీట్లను జనసేన పార్టీ కోరుతోంది. అయితే ఒంగోలులో కూడా కాపు సామాజికవర్గం ఓటర్లు 35 వేల 40 వేల వరకు ఉన్నారని.. కాబట్టి ఒంగోలు సీటును టీడీపీకి కాకుండా జనసేన పార్టీకి ఇస్తే మంచిదని సత్య పట్టుబడుతున్నట్టు సమాచారం. తద్వారా తన అన్న జనార్దన్ కు ఒంగోలు సీటు రాకుండా వ్యూహాలు పన్నుతున్నట్టు చెబుతున్నారు.
గతంలో ఒంగోలులో టీడీపీ మహానాడు కోసం ఏర్పాటు చేసిన హోర్డింగులు, బ్యానర్లలో ఎక్కడా దామచర్ల జనార్దన్ ఫొటో లేకుండా చేశారు... సత్య. కేవలం తన ఫొటో, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్య నేతల ఫొటోలు మాత్రమే హోర్డింగుల్లో, బ్యానర్లలో వేశారు. దీంతో దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య మధ్య విబేదాలు తెరమీదకొచ్చాయి.
ఇప్పటికే విజయవాడలో కేశినేని నాని, కేశినేని చిన్ని పోరుతో రచ్చకెక్కిన విభేదాలతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుందని అంటున్నారు. ఇప్పుడు పులి మీద పుట్రలా ఒంగోలులో అటు దామచర్ల జనార్దన్, ఇటు దామచర్ల సత్యకు విభేదాలు రావడంతో కలవరపడుతుందని చెబుతున్నారు.