ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పై ఇక టీడీపీ పెత్తనం!

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)పై వైసీపీ నేతల పెత్తనం పోయింది.

Update: 2024-08-17 09:40 GMT

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)పై వైసీపీ నేతల పెత్తనం పోయింది. ఇన్నాళ్లూ వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. అలాగే వైసీపీకి చెందిన పలువురు నేతలు ఏసీఏలో కీలక పదవుల్లో కొనసాగారు.

ఈ క్రమంలో ఏసీఏకి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. వందల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారనే అభియోగాలు వ్యక్తమయ్యాయి. మ్యాచుల నిర్వహణ, టికెట్ల అమ్మకాలు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్టేడియంల నిర్మాణాల్లోనూ భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పై వైసీపీ నేతల పెత్తనం తొలగింది. ఇప్పటివరకు కొనసాగిన ఏసీఏ కార్యనిర్వాహక వర్గం రాజీనామా చేయడంతో తాజాగా ఎన్నికలు నిర్వహించారు.

పోటీ లేకపోవడంతో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్‌ సెక్రటరీగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్‌ ఎన్నికయ్యారు. కాగా తుది ఫలితాలు సెప్టెంబర్‌ 8న అధికారికంగా ప్రకటించనున్నారు.

ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయిన కేశినేని చిన్ని ఇటీవల ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. తన సోదరుడు, వైసీపీ తరఫున పోటీ చేసిన కేశినేని నానిని ఓడించారు. ఏసీఏ కార్యదర్శిగా ఎన్నికయిన సానా సతీష్‌.. ఇటీవల ఎన్నికల్లో కాకినాడ నుంచి టీడీపీ/జనసేనల నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ప్రయత్నించారు. ఆయన పేరు గట్టిగా వినిపించింది. అయితే చివరకు జనసేన పార్టీ నేత తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ కు సీటు దక్కింది.

ఏసీఏ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయిన విష్ణుకుమార్‌ రాజు ఇటీవల ఎన్నికలలో విశాఖపట్నం ఉత్తరం నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Tags:    

Similar News