చిన్నికి ఇల్లు అలకగానే పండగ కాదన్నమాట!
2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల చంద్రబాబుతో విరక్తి చెంది జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే
2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల చంద్రబాబుతో విరక్తి చెంది జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ ఇంతపచ్చి మోసగాడని తనకు ఇప్పుడే తెలిసిందంటూ నానీ తెలిపారు! త్వరలో వైసీపీ కండువా కప్పుకోకున్నట్లు ప్రకటించారు! ఆ సంగతి అలా ఉంటే... ఈ విషయంతో అందరికంటే ఎక్కువ హ్యాపీ ఫీలయ్యింది ఎవరనేది తెలిసిన విషయమే! అయితే ఆయనకు సరికొత్త సమస్య వెల్ కం చెప్పింది!
కేశినేని నానిని పొమ్మనలేక పొగబెట్టారని చెబుతున్న వేళ.. అంతకంటే ముందునుంచి విజయవాడ తెలుగుదేశం ఎంపీ టికెట్ నానీ తమ్ముడు చిన్నికే అనే ప్రచారం టీడీపీలో మొదలైంది. ఇందులో భాగంగానే తిరువూరు సభకు రావద్దంటూ కేశినేని నానికి చంద్రబాబు హుకుం జారీచేసిన తర్వాత.. నానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్ని చెలరేగిపోతున్నారని అంటున్నారు. ఇక టిక్కెట్ తనకే కన్ ఫాం అని, ఉన్న ఒక్క అడ్డూ తొలగిందని భావిస్తున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఫుల్ బిజీగా గడుపుతున్న ఆయన... తాను పడిన కష్టం వల్లే విజయవాడ ఎంపీ సీటును టీడీపీ రెండు సార్లు గెలిచిందని చెప్పుకుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నేరుగా తానే రంగంలోకి దిగుతున్నాను కాబట్టి.. గెలుపు నల్లేరు మీద నడకైపోద్దని చెబుతున్నారని తెలుస్తుంది! అయితే... చంద్రబాబుని టిక్కెట్ విషయంలో బీఫాం అందేవరకూ నమ్మకూడదని చెబుతుంటారు. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేశినేని చిన్నికి కూడా అలాంటి అనుభవం రుచిచూసే అవకాశం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తుంది. కారణం... 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు నుంచి తాను పోటీ చేయబోతున్నట్టుగా సుజనాచౌదరి ప్రకటించుకున్నారు! సుజనా చౌదరికీ చంద్రబాబుకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! దీంతో చిన్నికి సుజనా చౌదరి రూపంలో గండం పొంచి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు నుంచి తాను పోటీ చేయబోతున్నట్టుగా సుజనా చౌదరి ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో... టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ కూడా జతకలిస్తే చిన్ని త్యాగం చేయడం తప్పకపోవచ్చు. అయితే ప్రస్తుతానికి బీజేపీతో పొత్తుపై క్లారిటీ లేనప్పటికీ... పొత్తు లేకపోయినా సుజనా చౌదరి విజయవాడ నుంచి పోటీచేయాలనుకుంటే... చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సుజనా చౌదరికి ఎంపీగా పోటీ చేసి గెలవడం అనేది చంద్రబాబు ఎంత ముఖ్యమనేది అందరికీ తెలిసిందే. కారణం... ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు కార్యక్రమాలు అనధికారికంగా చక్కబెట్టేది సుజనా చౌదరి అని అంటుంటారు! అలాంటి సుజనాచౌదరి ఓటమికి చంద్రబాబు సహకరించేది ఉండకపోవచ్చు. అవసరమైతే చిన్నికి టిక్కెట్ ఇచ్చి మరీ ఓడించగల నైపుణ్యం కూడా చంద్రబాబు సొంతం అని చెప్పేవారూ లేకపోలేదు! దీంతో... చిన్నికి ఇది కచ్చితంగా పైకిచెప్పుకోలేని బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు.