కేంద్రమంత్రి వర్గం.. దురదృష్టవంతుడు ఎవరంటే ఈయనే!

కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఒక కేంద్ర కేబినెట్‌ పదవి, ఒక సహాయ మంత్రి పదవి లభించాయి.

Update: 2024-06-10 12:30 GMT

కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఒక కేంద్ర కేబినెట్‌ పదవి, ఒక సహాయ మంత్రి పదవి లభించాయి. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణలో మరో ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభిస్తాయని టాక్‌ నడుస్తోంది. టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ఎంపికయ్యారు. ఇక తొలిసారే ఎంపీగా గెలిచిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ కు కూడా కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కింది.

కాగా ఇదే సందర్భంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిపైన చర్చ జరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని నాని టీడీపీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. 2019లో గెలిచిన కొద్ది రోజులకే టీడీపీ అధిష్టానంతో ఎడ ముఖం, పెడ ముఖంగా వ్యవహరించారు. నిత్యం సోషల్‌ మీడియా మాధ్యమాల్లో టీడీపీ అధిష్టానం నిర్ణయాలపై బహిరంగ విమర్శలు చేసేవారు. అంతేకాకుండా పార్టీ నేతలపైనా ధ్వజమెత్తేవారు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయనకు పూలబొకే కూడా ఇవ్వడానికి నిరాకరించి సంచలనం రేపారు.

ఈ పరిణామాలతో తాజా ఎన్నికల్లో విజయవాడ సీటును టీడీపీ కేశినేని నానికి ఇవ్వలేదు. ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి సీటు ఇచ్చింది. దీంతో చిన్ని భారీ మెజార్టీతో గెలుపొందారు. కేశినేని నాని వైసీపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు ఎంపీ స్థానంలో ఒక్క టీడీపీ అభ్యర్థిని కూడా గెలవనీయనని నాని శపథాలు చేశారు.

చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ లపై తీవ్ర విమర్శలు చేశారు. తన చరిష్మా, వ్యక్తిగత ఇమేజ్‌ తోనే రెండుసార్లు విజయవాడ ఎంపీగా గెలుపొందానన్నారు. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌ పాత్ర ఏమీ లేదన్నారు. విజయవాడ అభివృద్ధి కూడా తన వల్లే సాధ్యమైందని నాని గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు.

వాస్తవానికి విజయవాడ ఎంపీ స్థానంలో టీడీపీ కంచుకోటల్లో ఒకటి. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న సామాజికవర్గం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారు. అయితే నాని ఇదంతా తన గొప్ప అని అనుకున్నారు. అందుకే టీడీపీ అధిష్టానంపై కాలు దువ్వారు. వాపును చూసి బలుపు అని భావించారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనతోపాటు వైసీపీ తరఫున పోటీ చేసిన మొత్తం అభ్యర్థులంతా ఘోరంగా ఓటమి పాలయ్యారు.

అదే కేశినేని నాని సరిగ్గా ఉండి ఉంటే మళ్లీ విజయవాడ ఎంపీ స్థానం టీడీపీ తరఫున ఆయనకే దక్కేదని అంటున్నారు. మూడోసారి కూడా ఆయన ఎంపీగా గెలుపొందేవారని చెబుతున్నారు. తద్వారా సీనియర్‌ గా కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చంద్రబాబు స్థానం కల్పించేవారని పేర్కొంటున్నారు. సీనియార్టీ, విధేయత పరంగా రామ్మోహన్‌ నాయుడికి కేంద్ర కేబినెట్‌ మంత్రి పదవిని ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈయన కూడా 2014, 2019లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు. తాజాగా ఎన్నికల్లో మరోసారి గెలుపు రుచిచూశారు.

ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీ తరఫున విజయవాడ నుంచి గెలిచి ఉంటే ఆయన కూడా ఎంపీగా హ్యాట్రిక్‌ సృష్టించినవారు అయ్యేవారు. సీనియార్టీ, సామాజికవర్గ కోణంలో ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి లభించి ఉండేదని టాక్‌ నడుస్తోంది. అయితే నాని తప్పులు మీద తప్పులు చేసి టీడీపీకి దూరమయ్యారు. దీంతో ఇప్పుడు దురదృష్టవంతుడు ఎవరంటే కేశినేని నానినే అని అంటున్నారు.

Tags:    

Similar News